చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ ఉద్యోగి ఎస్వీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి వేణు గోపాల్ పై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థి తీవ్ర గాయాలపాలవటంతో స్థానికులు అతడిని రుయా ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది వేణు గోపాల్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ను కొనుగోలు చేయడంతో పాటు ఆ ఫోన్ కు ఇన్సూరెన్స్ చేయించాడు. 
 
కొన్ని రోజుల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ కిందపడి పగిలిపోవడంతో వేణు గోపాల్ ఫోన్ కు ఇన్సూరెన్స్ క్లైమ్ చేయాలని కంపెనీకి వెళ్లి కోరగా ఫైనాన్స్ ఉద్యోగి విద్యార్థిపై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే ఎస్వీ యూనివర్సిటీలో వేణుగోపాల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వేణు గోపాల్ ఫోన్ క్రిందపడి పగిలిపోవడంతో ఇన్సూరెన్స్ ను క్లైమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి చాలాసార్లు తిరిగాడు. 
 
కానీ  ఏజెంట్ హేమంత్ మాత్రం అతనిపై కక్ష కట్టి బైక్ పై వెళుతున్న వేణు గోపాల్ ను వెంబండించి బీర్ బాటిల్ తో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. పది మంది స్నేహితులతో కలిసి హేమంత్ వేణు గోపాల్ పై దాడి చేశాడని తెలుస్తోంది. వేణు గోపాల్ ను కొట్టటంతో పాటు ఆ సమయంలో హేమంత్ వేణుగోపాల్ ను కొడుతున్న ఘటనను ఫోన్ ద్వారా కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. 
 
ప్రస్తుతం వేణు గోపాల్ క్షేమంగానే ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై వేణు గోపాల్ మాట్లాడుతూ తనపై పైశాచికంగా దాడి చేశారని పోలీసులు తనకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వేణు గోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల విచారణలో హేమంత్ వేణు గోపాల్ పై దాడి చేయడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: