తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. యూనియన్ల స్థానంలో ప్రవేశ పెట్టిన వెల్ఫేర్ బోర్డుల పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తూతూ మంత్రంగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు కానీ, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ది చూపించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలంకార ప్రాయంగా ఉన్న కమిటీలతో తమకు ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు.

 

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత ఆర్టీసీ ప్రక్షాళనకు నడుం కట్టిన సీఎం కేసీఆర్...యూనియన్లను పూర్తిగా రద్దు చేశారు. ఉద్యోగ సంఘాల స్థానంలో...సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలకు ఇప్పుడు సంక్షేమ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇద్దరు సభ్యుల కమిటీలో... ఒక పురుషుడు, మరొకరు మహిళ ఉంటారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ కమిటీలు కేవలం డిపోలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

అన్ని డిపోల్లో ఒక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. తమ సమస్యల గురించి లేఖలు రాసి అందులో వేస్తారు. వాటిని సంక్షేమ కమిటీ పరిశీలించి....డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. కానీ కేవలం డిపోల్లో మాత్రమే కమిటీలు ఉండటం, డివిజనల్, రీజనల్ మేనేజర్, ఈడీ కార్యాలయాల్లో పని చేసే వందలాది సిబ్బందికి ఈ కమిటీలు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో పాటూ నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్‌ స్టేషన్లలో పని చేసే సిబ్బంది సమస్యల కోసం కూడా కమిటీలు ఏర్పాటు కాలేదు. కేసీఆర్ నోటి నుంచి అన్ని డిపోల్లో సంక్షేమ కమిటీలుండాలి అని వచ్చింది కాబట్టి.....అధికారులు కేవలం డిపోలపైనే దృష్టి పెట్టారా? అని ప్రశ్నిస్తున్నారు సిబ్బంది. మిగితా ఆర్టీసీ కార్యాలయాల్లో కమిటీలు ఎప్పుడు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.


 
గతంలో కార్మిక సంఘాలున్న సమయంలో తమ సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉండేదని, ఇప్పుడు సంఘాలు లేక, కమిటీలు లేక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు సిబ్బంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: