కసబ్‌ను హిందూ తీవ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? బెంగళూరు వాసిగా చూపించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారా? అంటే అవుననే అంటున్నారు ముంబై మాజీ సీనియర్‌ పోలీస్‌ అధికారి రాకేశ్‌ మారియా. ఆయన రాసిన పుస్తకంలో పాక్‌ కుట్రలను కళ్లకు కట్టారు. 


   
2008 నవంబర్‌ 26న పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గంలో ముంబైలో అడుగుపెట్టి నరమేధం సృష్టించారు ఉగ్రవాదులు. 166 మందిని పొట్టనపెట్టుకున్నారు. అయితే, ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను సజీవంగా పట్టుకోవడంతో ఉగ్రవాదులు అనుకున్నది సాధించలేకపోయారు. దాడి హిందూ ఉగ్రవాదుల పనిగా చిత్రీకరించాలన్న వాళ్ల ఎత్తుగడ పారలేదు.

 

ముంబై ఉగ్రదాడి కేసును సీనియర్‌ పోలీసు అధికారి రాకేశ్‌ మారియా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కసబ్‌ను కూడా ఆయన  ప్రశ్నించారు. ఆ విశేషాలతో లెట్‌ మి సే ఇట్‌ నౌ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో పాక్‌ ఉగ్రవాదుల కుట్రలను కళ్లకు కట్టారు మారియా. వాస్తవానికి 2008లో నవంబర్‌ 26న కాకుండా, సెప్టెంబర్‌ 27వ తేదీన ముంబైలో దాడి చేయాలని భావించాయి పాకిస్థాన్‌ నిఘా సంస్ఘా ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ - ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా. ఎందుకంటే... అది రంజాన్‌ ఉపవాస రోజుల్లో 27వది.  


 
కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చిత్రించాలనుకున్నాయి. దీనిలో భాగంగా కసబ్‌ కుడి చేతికి ఎర్రని దారం కట్టారు. అలాగే, బెంగళూరు వాసి సమీర్‌ దినేశ్‌ చౌదరిగా ఒక నకిలీ ఐడీ కార్డును తయారు చేసి కసబ్‌ మెడలో వేశారు. ఉగ్రదాడి సమయంలో భారత్‌ భద్రతా దళాల చేతిలో కసబ్‌ ఎలాగూ చనిపోతాడు కనుక... ఐడీ కార్డు ద్వారా అతను హిందూ ఉగ్రవాదిగా ముద్రపడతాడన్నది ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా వ్యూహం. మీడియా కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తుందని భావించాయి. అయితే, కసబ్‌ను సజీవంగా పట్టుకోవడంతో పాక్‌ ఎత్తుగడ పారలేదు.  

 

ప్రాణాలను పణంగా పెట్టి కసబ్‌ను పట్టుకున్న కాన్‌స్టేబుల్‌ తుకారాం ఓంబ్లే సాహసం అనన్యసామాన్యమంటూ చెప్పుకొచ్చారు రాకేశ్‌ మారియా. మరోవైపు... దర్యాప్తు సమయంలో పోలీసులు సంయమనం పాటించి కసబ్‌ ఐడెంటిటీని బయటపెట్టలేదన్నారు. చివరికి అతని పూర్తి పేరు మహ్మద్‌ అజ్మల్‌ అమిర్‌ కసబ్‌ దర్యాప్తులో తేలింది. అతను పాకిస్థాన్‌లోని ఫరీద్‌ కోట్‌ ప్రాంతానికి చెందిన వాడని ప్రపంచానికి వెల్లడి చేయగలిగామని వివరించారు రాకేశ్‌ మారియా. అంతేకాదు... చనిపోయిన మిగతా ఉగ్రవాదుల వద్ద కూడా నకిలీ ఐడీ కార్డులు లభించాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన అరుణోదయ కాలేజ్‌ విద్యార్థులుగా వాళ్లను చూపే ప్రయత్నం చేసింది పాకిస్థాన్‌ నిఘా సంస్థ ISI. 

 

కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోవడంతో... తమ గుట్టు బయటపడుతుందని ISI, లష్కరే తోయిబా భావించాయి.  జైల్లో ఉన్న కసబ్‌ను చంపే బాధ్యతను మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయి. అయితే, ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. 


  
దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో లష్కరే తోయిబాలో చేరాడు కసబ్‌. అతనికి జిహాద్‌ అంటే ఏంటో కూడా తెలియదంటూ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు మారియా. ముస్లింలను నమాజ్‌ చేయనివ్వరంటూ  అబద్ధాలు చెప్పి... కసబ్‌కు భారతపై వ్యతిరేకతను నూరిపోశారు. అయితే, ముంబైలో ఓ మసీదుకు కసబ్‌ను తీసుకెళ్లినప్పుడు... అక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్‌ ఆశ్చర్యపోయాడని వివరించారు మారియా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: