ఇంత వరకూ ఇతరుల కోసం పని చేసిన ప్రశాంత్‌ కిషోర్‌... ఇప్పుడు ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌ కాబోతున్నారా. ఇప్పుడు బీహార్‌ సీఎం నితీష్‌ను టార్గెట్‌ చేశారు. పీకే టార్గెట్ కేవలం నితీషేనా? ఏకంగా ఢిల్లీలోని బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? కింగ్‌ మేకర్‌ నెక్ట్స్‌ టార్గెట్ ఏంటి ?

 

ప్రశాంత్‌ కిషోర్‌ ఎవరి తరఫున పని చేస్తే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం ఖాయమని చాలా మంది పోలిటీషియన్ల నమ్మకం. కేవలం ప్రత్యర్థి బలహీనతల్ని టార్గెట్‌ చేయడమే కాదు... మనలో లోపాలను సరిదిద్దుకోకుండా సక్సెస్‌ సాధించలేమన్నది పీకే సిద్ధాంతం. ఇదే ఫార్ములాను ప్రయోగించి ఇంత వరకూ సక్సెస్‌ సాధిస్తూ వస్తున్నారు ప్రశాంత్‌ కిషోర్‌.   

 

ఇంత వరకూ ఇతరుల కోసం పని చేసి... కింగ్‌ మేకర్‌ అనిపించుకున్న ప్రశాంత్‌ కిషోర్‌... ఇప్పుడు కింగ్‌ కావాలనుకుంటున్నారు. బీహార్‌ నుంచి దీనికి బీజం వేయబోతున్నారు. బాత్ బిహార్ కీ కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్న పీకే... ఏకంగా సీఎం కావాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పీకే పార్టీ పెడతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.  


   
ప్రస్తుతం దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్‌ తన ప్రాభవాన్ని అంతకంతకూ కోల్పోతోంది. ఈ పరిస్థితుల్లో పీకే పార్టీ అంటూ పెడితే... దానిని బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫోకస్‌ చేసే అవకాశం లేకపోలేదు.  బీజేపీ, కాంగ్రెస్‌లకూ దూరంగా ఉన్న పార్టీలను కలుపుకుని వెళ్తూ... ఉత్తర, మధ్య భారతదేశాల్లో సత్తా చాటాలన్నది ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహంగా కనిపిస్తోంది.


 
ఇదిలా ఉంటే... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆప్‌... తమ వ్యూహకర్త పీకేకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పీకేని నిలబెట్టాలని కేజ్రీవాల్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీహార్ లో విజయం సాధించడం ద్వారా తమ ప్రత్యర్థి బీజేపీకి గట్టి షాకివ్వాలన్నది కేజ్రీవాల్‌ వ్యూహం.     

 

తనను పార్టీ నుంచి బహిష్కరించిన నితీష్‌ కుమార్‌కు గద్దె దించి... తాను సీఎం పీఠం అధిష్టించాలని పట్టుదలగా ఉన్నారు జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు పీకే.  అయితే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలే గడువుంది. మరోవైపు... ప్రశాంత్‌ కిషోర్‌ వంద రోజుల యాత్రకు సిద్ధం కావడం వల్ల మూడు నెలలు అక్కడే పోతుంది. ఇక మిగిలేది ఐదు నెలలే. ఈ పరిస్థితుల్లో ఆయన సొంత పార్టీ పెడతారా..? లేక చిరకాల మిత్రుడు కేజ్రీవాల్‌ సూచన మేరకు ఆమ్‌ ఆద్మీ తరఫున పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

 

మొత్తానికి ఇంత వరకూ రాజకీయ నాయకులకు సహాయ సహకారాలు అందించిన ప్రశాంత్‌ కిషోర్‌... ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారబోతున్నారు. మరి రాజకీయాల్లో ఆయన ఎంత వరకూ రాణిస్తారో... చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: