తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల క్రితం సహకార సంఘాల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సహకార ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షల రూపాయలు పంచినా, ఓటర్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చినా ఎన్నికల్లో విజయం సాధించకపోవడంతో కొందరు అభ్యర్థులు ఏం చేయాలో అర్థం కాక తాము ఇచ్చిన డబ్బులు, బహుమతులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
తాజాగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఓటమిపాలైన పాశం నర్సింహులు అనే నాయకుడు ఓటర్లకు తాను ఇచ్చిన ఖరీదైన చీరలను, డబ్బులను తిరిగి ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. తాను ఎన్నికల్లో ఓటమిపాలయ్యానని ఓటర్లు నిజాయితీతో తాను ఇచ్చినవాటిని తిరిగిచ్చేసి తమ నిజాయితీని చాటుకోవాలని కోరుతున్నాడు. నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామం నుండి సహకార ఎన్నికల్లో నర్సింహులు పోటీ చేశారు. 
 
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నర్సింహులు ఓటర్లకు డబ్బులు, చీరలు, బహుమతులు పంచారు. కానీ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటంతో నర్సింహులు ఇంటింటికీ వెళ్లి డబ్బు, బహుమతులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కొంతమంది ఓటర్లు నర్సింహులు కోరిన వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వగా కొంతమంది మాత్రం అతడితో గొడవకు దిగారు. నర్సింహులుకు రాజకీయాలు కొత్తేం కాదు. 
 
గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార రంగం ఛైర్మన్ గా పని చేసిన నర్సింహులు తాజా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో 98 ఓట్లలో కేవలం 7 ఓట్లు మాత్రమే నర్సింహులుకు రాగా గెలిచిన అభ్యర్థికి 79 ఓట్లు వచ్చాయి. నేను ఇచ్చిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వండి అంటూ ఓటర్లను నర్సింహులు కోరడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ప్రతి మహిళకు ఒక చీర, రెండు వేల రూపాయల నుండి 3,000 రూపాయలు డబ్బులు నర్సింహులు పంచినట్టు గ్రామంలో ప్రచారం జరుగుతోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: