మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు నువ్వుల పాల‌య్యారా? ఆయ‌న వ్యూహం బెడిసికొట్టిందా?  ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదా? అంటే.. విజ‌య‌వాడ టీడీపీ నాయ‌కులు ఔననే అంటున్నారు. వారిలో వారు ఈ విష‌యాన్ని తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు కూడా. బుధ‌వారం నుంచి పార్టీ త‌ర‌ఫున ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లు నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు పెద్ద వ్యూహం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ యాత్ర‌లు నిర్వ‌హించి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డాల‌ని ప్లాన్ చేసుకు న్నారు.



ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా నుంచి చంద్ర‌బాబు ఈ యాత్ర‌ను ప్రారంభించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మ‌రికొంద‌రు ఈ యాత్ర స‌న్నాహ‌కాల్లో భాగంగా ప‌లు చోట్ల యాత్ర‌లు ప్రారంభించారు. కృష్ణాజిల్లాకు చెందిన దేవినేని ఉమా ఈ యాత్ర‌ను ఘ‌నంగా ప్రారంభించాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలో కాకుండా విజ‌య‌వాడ‌ను ఆయ‌న ఎంచుకున్నారు.



ఈ విష‌యాన్ని విజ‌య‌వాడ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయ‌న ప్రాథ‌మిక ఏర్పాటు చేశారు. ఈ యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ త‌ర‌పున ఓ ప్ర‌క‌ట‌న కూడా జారీ అయింది. అయితే, దీనిలో ఎంపీ కేశినేని నాని పేరు లేక‌పోవ‌డం వివాదానికి దారితీసింది. అయినా కూడా దేవినేని మాత్రం యాత్ర‌ను ప్రారంభించి.. బ‌స్సులో వ‌చ్చి.. విజ‌య‌వాడ‌లో ఉద‌యం తొమ్మిదికే ప్ర‌సంగాలు ప్రారంభించారు. అయితే, ఆ స‌మ‌యంలో ప‌ట్టుమ‌ని 100 మంది కూడా కార్య‌క‌ర్త‌లు క‌నిపించ‌లేదు.



అంతేకాదు, ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన బుద్దా వెంక‌న్న కూడా వ్యూహాత్మ‌కంగా ఎస్కేప్ అయ్యారు. దీంతో వ‌చ్చిన వారితోనే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన దేవినేని మ‌మ అనిపించి ముగించారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, జ‌లీల్ ఖాన్, ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడు కూడా హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు దేవినేని ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: