జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సిబిఐ కేసులను బూచిగా చూపించి జగన్ ను అరెస్టు చేసేంత ధైర్యం కేంద్రప్రభుత్వం చేయదని అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రజాధరణ కలిగిన జగన్ ను కేంద్రం అరెస్టు చేస్తుందని తాను అనుకోవటం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోని అందరు ముఖ్యమంత్రుల్లో అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్ మాత్రమే అని ఇప్పటికే రుజువైందన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు.

 

తన అరెస్టుకు జగన్ మానసికంగా సిద్ధపడితే కేంద్రం కూడా చేయగలిగేది ఏమీ ఉండదన్నారు. ఇప్పటికే 16 మాసాలు జైలు జీవితం గడపిన జగన్ కు మళ్ళీ జైలు కెళ్ళటమంతే కొత్తేమీ కాదన్న విషయాన్ని కేంద్రానికి  స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అప్పుడు కానీ జగన్ అంటే ఏమిటో కేంద్రానికి తెలిసిరాదని ఉండవల్లి సవాలు విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారా ? లేకపోతే తన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపుతారా అని అడిగితే కేంద్రం కూడా చేయగలిగేది ఏమీ ఉండదన్నారు.

 

తనపై ఉన్న కేసులకు భయపడే జగన్ కేంద్రాన్ని ప్రత్యేకహోదా విషయాన్ని అడగటం లేదన్న తెలుగుదేశంపార్టీ నేతల ఆరోపణలకు ఉండవల్లి పై విధంగా స్పందించారు. జగన్ ను అరెస్టు చేస్తే ఏమవుతుందో కేంద్రానికి కూడా బాగా తెలుసన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం బెదిరింపులు అన్నీసార్లు వర్కవుట్ అవ్వవంటూ ఉండవల్లి తేల్చేశారు. జగన్ పై ఉన్న కేసుల విషయంలో కేంద్రం కూడా చేయగలిగేది ఏమీ ఉందంటూ స్పష్టంగా చెప్పేశారు.

 

పనిలో పనిగా ఉండవల్లి రాజమండ్రిలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాజమండ్రిలో బెంచ్ ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆలోచనగా ఉండవల్లి గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది మెజారిటి ప్రజల కోరికగా ఉండవల్లి గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: