ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించిన తొలి రోజునే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నలుగురికి ఇన్చార్జ్ ప‌ద‌వులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో టిడిపి కేవలం 23 సీట్లలో విజయం సాధించి ఘోర ప‌రాజ‌యం మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఇద్దరూ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు చాలా జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీని వీడటం లేదా పార్టీకి దూరం అవ్వ‌డం జరిగింది. ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల ఇన్చార్జిలు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియకకేడ‌ర్  సతమతం అవుతోంది.



తాజాగా బుధవారం చంద్రబాబు నాలుగు నియోజకవర్గాల‌కు ఇన్చార్జ్‌ల‌ను నియమించారు. గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్టీ నేత వేగేశ్న నరేంద్ర వర్మ పేరు ఖరారు చేశారు. ఆయన గత ఎన్నికల్లోనే సీటు ఆశించారు. అదే జిల్లాలోని మాచర్ల నుంచి కొమ్మారెడ్డి చలమారెడ్డి పేరును ఖరారు చేశారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ ఓడిన అన్న‌పురెడ్డి అంజిరెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.



ఇక బాప‌ట్ల‌లో ఓడిన అన్నం స‌తీష్ బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి మృతి చెంద‌డంతో అక్క‌డ బాధ్య‌త‌లు ఆయ‌న సోద‌రుడు బ‌డేటి రాధాకృష్ణ‌కు ఇచ్చారు. ఇక కీల‌క‌మైన గుడివాడ‌లో చంద్ర‌బాబు అటు తిరిగి ఇటు తిరిగి మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకే మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెలేలు ఉన్న గ‌న్న‌వరం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఎవ్వ‌రికి బాధ్య‌త‌లు ఇవ్వ‌లేదు. ఆ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. అలాగే పార్టీ మారిన మ‌రో ఎమ్మెల్యే గిరి నియోజ‌క‌వ‌ర్గం అయిన గుంటూరు ప‌శ్చిమంలో మాత్రం ఇప్ప‌టికే కోవెల‌మూడి ర‌వీంద్ర‌ను నియ‌మించిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: