ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకనుండి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో నగదు లేకున్నా ప్రయాణించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగదు రహిత ప్రయాణానికి అధికారులు ముందడుగు వేశారు. ఈరోజు విజయవాడలోని ఆర్టీసీ బస్సుల్లో అధికారులు నగదు రహిత ప్రయాణానికి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 
 
ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం అతి త్వరలో రాష్ట్రమంతటా నగదు రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఛలో మొబైల్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ తో పాటు స్మార్ట్ కార్డులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈరోజు విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఛలో మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. 
 
ఆర్టీసీ ఎండీ ప్రతాప్ మాట్లాడుతూ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన స్మార్ట్ కార్డులను టిమ్ మిషన్ సహాయంతో ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఈ స్మార్ట్ కార్డులను ఉపయోగించడం వలన ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. స్మార్ట్ కార్డులతో ఆర్టీసీ సిబ్బందికి గతంతో పోలిస్తే సమయం ఆదా అవుతుంది. ప్రయాణికులు, కండక్టర్లు చిల్లర సమస్యతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. 
 
ప్రయాణికుల దగ్గర కార్డు ఉంటే నగదు లేకపోయినా ప్రయాణం చేయవచ్చు. రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో నగదు రహిత చెల్లింపులు జరిగే విధంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. స్మార్ట్ కార్డుల ద్వారా ఆర్టీసీ నగదు రహిత ప్రయాణం దిశగా ముందడుగులు వేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బస్టాండ్లలో ఈ పాస్ యంత్రాల ద్వారా ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసేలా ఆర్టీసీ చర్యలు చేపట్టినా ఈ పాస్ యంత్రాలు పెద్దగా సత్ఫలితాలనివ్వలెదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: