ప్రణాళికా బద్ధంగా అవినీతి ఎలా చేయాలో.. టౌన్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో. అనుమతులు ఇచ్చేందుకు ఆఫీసులోనే నేరుగా డబ్బు తీసుకోవడం, డబ్బు ఇవ్వని అనేక నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా ఫైల్స్‌ తొక్కిపెట్టడం... ఇలా ఎన్నోఅక్రమాలు ఏసీబీ దాడుల్లో బయటికొస్తున్నాయి. ఏపీలో కీలకమైన కార్పొరేషన్లలో ఒకటైన బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అవినీతి అధికారులను గుర్తించిన ఏసీబీ... చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తోంది.

 

విజయవాడలో ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసినప్పటి నుంచి అది పూర్తయ్యేదాకా... టౌన్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎవరు వచ్చి ఏం ఇబ్బంది పెడతారో? అని నగర వాసులు హడలిపోతున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేయటానికి ఆన్ లైన్ విధానం తీసుకువచ్చినా... అందులో కూడా అనేక సాకులు చూపి మరీ పట్టణ ప్రణాళిక అధికారులు జలగల్లా జనాల్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెజవాడలో పట్టణ ప్రణాళిక అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే... ప్రతి పనికీ ఒక రేటును నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారట అధికారులు. అదనపు అంతస్తు నిర్మిస్తే రెండు నుంచి ఐదు లక్షలు ఇవ్వాలి. ఇక అనుమతిలేని నిర్మాణాలు, చిన్నపాటి కట్టడాలకు 50 వేల నుంచి ఒకటిన్నర లక్షలు వరకు ఇవ్వాల్సిందే. ఎన్వోసీలు ఇవ్వటానికి 50 వేలు, ప్లాన్ల మంజూరుకు ఫ్లోర్‌కు 5 నుంచి 10 వేలు... ఇలా ప్రతి దానికీ ఓ రేటు ఫిక్స్ చేసి, జనం జేబు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 

డబ్బులు ఇవ్వని వారిని వేధించటానికి... చైన్ మెన్లు, ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దింపుతున్నారు... బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు. పట్టణ ప్రణాళిక విభాగంలోని ప్రతి అధికారీ ఇదే దందా చేస్తున్నా... శాఖాధిపతి కూడా పట్టనట్టు వ్యవహరించటం మరో కోత్త కోణం. తాజాగా జరిపిన దాడుల్లో... ప్రైవేటు వ్యక్తులతో పాటు, 12 మంది అధికారుల దగ్గర... అక్రమంగా నగదు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అధికారులు చేస్తున్న భారీ దోపిడీతో... చైన్ మెన్లు, ప్రైవేటు దళారీలు కూడా లక్షలు వెనకేసుకుంటున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చిన అధికారులను మాతృసంస్థకు సరెండర్ చేసినా... పైరవీలు చేసి మళ్ళీ అదే సీటులోకి వచ్చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ అధికారులు. పై సంపాదనకు బాగా అలవాటు పడ్డంవల్లే ఆ కుర్చీలను అంత ఈజీగా వదులుకోలేక పోతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఏసీబీ దాడులు జరిగిన అధికారులు కూడా... తిరిగి బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లో తమ సీట్లోకి దర్జాగా వచ్చేశారు. 

 

పట్టణ ప్రణాళిక విభాగపు అధికారిగా నగరంలో పనిచేసిన వెంకటరత్నం ఇంటిపై ఇటీవల ఏసీబీ దాడులు జరిగాయి. అదే విభాగంలో పని చేసి ఆ తర్వాత కంట్రీ ప్లానింగ్‌కు వెళ్ళిన రఘు అనే అధికారి ఆస్తులను చూసి... ఏసీబీకి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇటీవల సీఆర్డీయే నుంచి బెజవాడ కార్పొరేషన్ కు వచ్చిన మురళి గౌడ్ పైనా ఏసీబీ దాడులు జరిగాయి. ఇక బెజవాడ కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ... ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి సస్పెండ్‌ అయ్యారు. బెజవాడ కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులను గత ప్రభుత్వం సస్పెండ్ చేసినా... ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అందరూ మళ్ళీ పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు.

 

ప్రస్తుతం విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్లో ఏసీబీ ముమ్మరంగా తనిఖీలు జరుపుతోంది. అక్రమ నిర్మాణాలతో పాటు, అనుమతులు ఇవ్వకుండా ఆపిన నిర్మాణాల వెనుక... ఏయే కారణాలు ఉన్నాయనే దానిపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఏసీబీ ఇప్పటికైనా అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం... పట్టణ ప్రణాళిక అధికారులకు చిటికెలో పని అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: