అమరావతి భూముల వ్యవహారం కీలక మలుపు తిరగబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే టెన్షన్ పెరిగిపోతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పేదలకు అమరావతి ప్రాంతంలో భూమి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటమే ఈ టెన్షన్ కు ప్రధాన కారణం. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ప్రభుత్వం సేకరించిన భూమిలోనే పేదలకు పట్టాలు పంపిణి చేయటానికి యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.

 

నిజానికి అమరావతి పరిధిలోని భూములను రాజధాని నిర్మాణానికి రైతుల నుండి చంద్రబాబునాయుడు తీసుకున్నారు. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించటంలో ఫెయిలయ్యారు. దాంతో జగన్ అందుబాటులో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు పట్టాల రూపంలో పంచేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా అధికారులు  4 వేల ఎకరాల్లో పట్టాల పంపిణికి రెడీ చేశారట.

 

అమరావతి భూముల్లో నాలుగు వేల ఎకరాలను పట్టాలుగా చేసి పేదలకు పంపిణి చేయటమంటే ప్రస్తుత పరిస్ధితుల్లో  మామూలు విషయం కాదు. రాజధానికి తాము భూములిస్తే తమ కళ్ళముందే పట్టాలుగా వేసి పేదలకు పంపిణి చేస్తుంటే రైతులు చూస్తు ఊరుకుంటారా ? అందులోను తెరవెనుక నుండి తెలుగుదేశంపార్టీ రెచ్చగొడుతున్న నేపధ్యంలో.  ఇప్పటికే రాజధాని మార్పుకు వ్యతిరేకంగా గడచిన 60 రోజులుగా రైతులతో పేరుతో జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలిసిందే.

 

ఈ నేపధ్యంలో పట్టాలు అందుకున్న పేదలకు, స్ధానిక రైతులకు మధ్య గొడవలు జరిగితే బాధ్యతెవరిది ? ఇంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తోందో అర్ధం కావటం లేదు.  పైగా స్ధానిక రైతులను కాదని పట్టాలు తీసుకున్న పేదలు అక్కడ ఇళ్ళు వేసుకుని  ప్రశాంతంగా ఉండగలుగుతారా ? ముందుగా రైతుల సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత ప్రభుత్వం ఏమి చేసినా పెద్దగా సమస్యలు రావు. కానీ అదేమీ పట్టించుకోకుండా ప్రతిపక్షాలు చూస్తు ఊరుకుంటాయని ప్రభుత్వం అనుకుంటే పొరబాటే. మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: