కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే టిడిపి ఏర్పాటయిన దగ్గర నుండి పార్టీకి కంచుకోటనే చెప్పాలి. ఎప్పుడో ఒకటి అర తప్ప మిగిలిన అన్నీ ఎన్నికల్లోను టిడిపి అభ్యర్ధులే గెలిచారు. ఇటువంటి బలమైన నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎదురు తిరిగారు. ఏ పార్టీలోను చేరలేదు కానీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు.

 

చంద్రబాబుపై వంశీ అమ్మనాబూతులు తిట్టి పార్టీకి దూరమై ఇప్పటికి సుమారు మూడు నెలలు అవుతోంది. అప్పటి నుండి ఇప్పటికీ వంశీకి ధీటుగా నిలబడే నేతను మాత్రం చంద్రబాబు వెతికి పట్టుకోలేకపోతున్నారు.  గుడివాడ, గుంటూరు  పశ్చిమం, బాపట్ల, ఏలూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించిన చంద్రబాబు గన్నవరం విషయంలో మాత్రం నేతను ఎంపిక చేయలేకపోతున్నారంటే ఏమిటర్ధం ?

 

పైగా వంశీ ప్లేసులో నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకోవటానికి జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్, విజయవాడ తూర్పు ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనూరాధతో పాటు మరో నేత పుట్టుగుంట సతీష్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరూ చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావించారని సమాచారం. ఇద్దరు నేతలు ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవటానికి ముందుకొచ్చిన చంద్రబాబు మాత్రం వాళ్ళకు హామీ ఇవ్వలేదట.

 

ఇదే విషయమై పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. గన్నవరం లాంటి కీలకమైన నియోజకవర్గంలో పార్టీకి గట్టి నేత లేకపోవటం పెద్ద మైనస్ అనే  చెప్పాలి. పైగా తొందరలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం మీద సర్పంచ్ నుండి జడ్పిటిసి వరకూ గట్టి అభ్యర్ధులను ఎంపిక చేయాలంటే నియోజకవర్గ ఇన్చార్జి చాలా అవసరం. అలా కాకుండా చివరి నిముషంలో ఎవరో ఒకరిని పెడితే మొత్తం పార్టీనే కుప్ప కూలటం ఖాయం. ఇదే విషయాన్ని చెప్పినా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. మరి కారణం ఏమిటో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: