కోవిడ్‌-19..! ఈ పేరు వింటనే ప్రపంచదేశాలు హడలెత్తిపోయే పరిస్థితి. ఈ మహామ్మారి ఆసియా అగ్రరాజ్యం చైనాను అతలాకుతలం చేసింది. దీన్ని చూసి ప్రపంచదేశాలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాయ్‌. ఇంతటి మహమ్మారి కన్ను ఇప్పుడు ప్రతిష్టాత్మక ఒలింపిక్‌ గేమ్స్‌పై పడింది.కరోనా ఎఫెక్ట్‌తో టోక్యో ఒలింపిక్స్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయ్‌.

 

కోవిడ్‌-19 కల్లోలానికి అంతేలేకుండా పోతోంది. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తూ..  2 వేలకు పైగా ప్రాణాలను బలిగొంది కోవిడ్‌-19. ఇన్నాళ్లూ చైనా సమస్యగా మారిన కరోనా ఇప్పుడు ప్రపంచ సమస్యై కూర్చుంది. ఈ  వైరస్ 27కి పైగా దేశాల్లో ఉంది. ఇందులో అభివృద్ధి చెందినవి, చెందుతున్నవి ఉన్నాయి. వుహాన్‌లో మాదిరిగా వైరస్ విస్తరించడం మొదలు పెడితే... కొన్ని దేశాలు వైరస్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సార్స్‌, మెర్స్, ఎబోలా, స్వైన్‌ఫ్లూ లాంటి అనేక వైరస్‌లను మించి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా. ఇన్ని దేశాలను భయపెడుతున్న కరోనా ఇప్పుడు ఒలింపిక్స్‌పై ప్రభావం చూపడానికి రెడీ అయింది. చైనాలో డెత్‌ బెల్స్‌ మోగిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనా పక్కనున్న జపాన్‌కు ఈ వైరస్‌ సెగ తగిలింది.  మెగా ఈవెంట్‌ జరిగే టోక్యో ఒలింపిక్స్‌ పైనా కరోనా ఎఫెక్ట్‌  పడనుంది. 

 

ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌పైనే..  క్రీడాలోకం దృష్టిసారించింది. 56 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న ఉత్సాహంలో ఉన్న జపాన్ మెగా క్రీడలపోటీలకు సర్వం సిద్ధం చేస్తోంది...షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు తొమ్మిది వరకు ఒలింపిక్స్  జరగనున్నాయ్‌.  ఈ మెగా ఈవెంట్‌ కోసం జపాన్‌ గత నాలుగేళ్లుగా ఎంతో శ్రమించింది. పురాతన జపాన్‌ సంస్కృతి, అధునాతన టెక్నాలజీ కాంబినేషన్‌తో టోక్యో ఒలింపిక్స్‌ వేడుకలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది జపాన్‌. ఈ మెగా ఈవెంట్‌ను  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. టెక్నాలజీకి మారుపేరైన జపాన్.. మెగా ఈవెంట్‌కు హాజరయ్యే అతిథులు, అథ్లెట్లకు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలకాలని ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ మస్కట్లను జపాన్ అధికారికంగా ఎంపిక చేసింది. ఆసియాలోనే ఈ మెగా ఈవెంట్‌ను నభూతో నభవిష్యత్‌గా చేయాలని జపాన్‌ ఉవ్విల్లూరుతోంది. అయితే, జపాన్‌ ఆశలకు కరోనా గండి కొట్టడానికి రెడీ అయింది. 

 

డ్రాగన్‌ను వణికిస్తోన్న కరోనా.. మెల్లమెల్లగా ఆసియా దేశాల్లో పంజా విసురుతోంది. చైనా పక్కనే ఉన్న హాంకాంగ్‌, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌, థాయిలాండ్‌ దేశాల్లో కోవిడ్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ దేశాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. చాలా మంది ప్రజలు కరోనా అనుమానితులుగా ఆస్పత్రుల్లో మగ్గుతున్నారు. అటు  టోక్యో ఒలింపిక్స్ నిర్వహించనున్న జపాన్‌లోనూ 40 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. మరోవైపు కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు 15 రోజులకు పైగా యొకహమా తీరంలో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ షిప్పులో ఉన్న వారికి.. కోవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. మొదట హాంకాంగ్ వాసికి  పాజిటివ్ రాగా.. ఇప్పుడది ఏకంగా ..300 మందికి పైగా వ్యాపించింది. డైమండ్ ప్రిన్సెస్ షిప్పులో 3 వేల 7 వందల 11 మంది ప్రయాణికులు ఉన్నారు. పలు దఫాల వైద్య పరీక్షల తర్వాత వైరస్ ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత 500 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. మరో 300 మంది అమెరికన్లను ఆ ప్రభుత్వం ఇప్పటికే సొంతదేశానికి తీసుకెళ్లింది. మరికొంత మందిని త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే, ఆ నౌకలో కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే ఓ వృద్ద మహిళ మరణించింది. దీంతో కరోనా మృతుల జాబితాలో జపాన్‌ చేరిపోయింది. 

 

కల్లోల కరోనా దెబ్బకు ఇప్పుడు మెగా క్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో ఒలింపిక్స్ రద్దవ్వొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు దాదాపు 11,000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఎన్నో దేశాల నుంచి ఈ మెగా క్రీడల్లో పాల్గొనడానికి అధ్లెట్లు తరలివస్తారు. అయితే, కరోనా డేంజర్‌తో ఇంతమందికి సరియైన సదుపాయాలు కల్పించడం జపాన్‌కు ఓ సవాల్‌గా మారనుంది.  ఆశే మన మార్గాల్లో వెలుగులు నింపుతుంది అనే నినాదంతో ఒలింపిక్స్‌ నిర్వహణకు నడుం కట్టిన జపాన్‌.. ఇప్పుడు కూడా అదే మాట వల్లెవేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కలకలం రేపుతున్నా.. జపాన్‌ ఏ మాత్రం భయపడటం లేదు. జపాన్‌ రాజధాని టోక్యోలోని షింజుకు నేషనల్‌ స్టేడియంలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ చైనాకు రాకపోకలను నిలిపివేస్తున్నా.. దీని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదని జపాన్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: