తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వైరస్ అన్ని దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 2000 మందికి పైగా మృతి చెందినా 70,000 మందికి పైగా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే కరోనాతో భయపడుతున్న ప్రజలను తాజాగా స్వైన్ ఫ్లూ భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని గాంధీ అస్పత్రిలో రోజురోజుకు స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. 
 
స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నప్పటికీ గాంధీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం రోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది రోజురోజుకు స్వైన్ ఫ్లూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నా ఆలసత్వం వహిస్తున్నారని గాంధీ ఆస్పత్రి మరోసారి ఆరోపణలను మూటగట్టుకుంటోంది. అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు పత్తా లేకుండా పోతున్నారని రోగులు చెబుతున్నారు. 
 
వైద్య సిబ్బంది స్వైన్ ఫ్లూ రోగుల విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఒక నిండు గర్భిణి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా ఆమెను పట్టించుకునేవారు కూడా కరువవడంతో ఈ ఉదంతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఉదంతంలో వైద్యులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటివరకూ దాదాపు 30 కేసులు గాంధీ ఆస్పత్రిలో నమోదైనట్టు తెలుస్తోంది. స్వైన్ ఫ్లూ రోగులకు సాధారణ రోగుల మధ్య పడకను కేటాయించడం కూడా వివాదాస్పదమవుతోంది. గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది మాస్కులను కూడా అందుబాటులో ఉంచడం లేదని ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని పలువురు విమర్శలు చేస్తున్నారు.                              

మరింత సమాచారం తెలుసుకోండి: