కొడాలి నాని దెబ్బకు గుడివాడలో టీడీపీకి నాయకుడే కరువైపోయిన విషయం తెలిసిందే. నాని వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి టీడీపీకి సరైన అభ్యర్ధి మాత్రం దొరకడం లేదు. 2014లో ఏదో రావి వెంకటేశ్వరరావుని పోటీకి తీసుకొచ్చారు గానీ, ఆయన నాని ముందు నిలబడలేకపోయారు. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న గుడివాడలో మాత్రం కొడాలి గాలే వీచింది. సరే రావి ఏదొకవిధంగా ఇన్ చార్జ్ గా కష్టపడుతూ పార్టీని నడిపిస్తున్నారు అనుకుంటే 2019 ఎన్నికల్లో ఆయనకు బాబు భారీ షాక్ ఇచ్చారు. ఉన్నపళంగా దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి పోటీ చేయించారు.

 

పోనీ అవినాష్ ఏమన్నా గట్టి పోటీ ఇచ్చాడా? అంటే అది లేదు. రావి కంటే ఘోరంగా ఓడిపోయాడు. సరేలే ఓడిపోయినా, పార్టీని నడిపిస్తాడు అనుకుంటే మధ్యలోనే వదిలేసి వైసీపీలోకి జంప్ అయిపోయారు. ఇక ఇక్కడ నుంచే కథ మళ్ళీ మొదటికొచ్చింది. నానికి పోటీగా ఉండేందుకు ఏ నాయకుడు సాహసం చేయడం లేదు. దీంతో చంద్రబాబు...మళ్ళీ రావిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా రావిని ఒప్పించి, టీడీపీ ఇన్ చార్జ్ పదవి కట్టబెట్టారు.

 

అసలు చంద్రబాబు గుడివాడలో రావిని వాడుకున్నట్లుగా మరి ఏ నాయకుడుని వాడుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే తండ్రి, సోదరుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రావి.. 2000 సంవత్సరంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక దీని తర్వాత 2004 ఎన్నికల్లో రావికి టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టేసి కొడాలి నానికి ఇచ్చారు. ఇక్కడ నుంచి రావి కనుమరుగైపోయి, కొడాలి నాని పుంజుకున్నారు. అలా అలా కొడాలి ఎదుగుతూ టీడీపీని వీడి, వైసీపీలో చేరి  ఇప్పుడు మంత్రి కూడా అయిపోయారు.

 

అయితే కొడాలి ఎప్పుడైతే హ్యాండ్ ఇచ్చాడో, అప్పుడు మళ్ళీ బాబుకు రావి గుర్తొచారు. దీంతో 2014లో తీసుకొచ్చి, పోటీ చేయించి ఓటమి పాలయ్యేలా చేశారు. తర్వాత 2019లో టికెట్ ఇవ్వకుండా పక్కనబెట్టి, అవినాష్‌ని తీసుకొచ్చి ఓడేలా చేశారు. ఇక అవినాష్ కూడా జంప్ అయిపోవడంతో మళ్ళీ రావి వద్దకే వెళ్ళి, చివరికి ఆయననే నియోజకవర్గ ఇన్ చార్జ్‌గా పెట్టారు. మొత్తానికైతే అవసరానికి రావిని పక్కనబెట్టేయడం, బయటకు తీసుకురావడం చేస్తూ, ఫుట్ బాల్ ఆడేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల సమయానికి రావి పరిస్తితి ఏంటో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: