చైనాలో కరోనా అంతకంతకూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 2 వేల మంది చనిపోగా.. 74 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చైనీయులకు నో ఎంట్రీ బోర్డులు కనిపిస్తున్నాయి.  ఇప్పుడు రష్యా కూడా చైనీయులపై బ్యాన్ పెట్టింది. 

 

కరోనా వైరస్ తో చైనాలో మరణించిన వారి సంఖ్య 2000 దాటింది. బుధవారం మరో 136 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. వీరంతా వైరస్‌ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సుకు చెందిన వారే. కొత్తగా నమోదైన 1,749 కేసులతో బాధితుల సంఖ్య 74,185కు ఎగబాకింది. వీరిలో 11,977 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 5,248 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటి వరకు 14,376 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. అయితే బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిలో 1,716 మందికి వైరస్‌ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక హాంకాంగ్‌లో 62 కేసులను నిర్ధారించారు. మకావులో 10, తైవాన్‌లో 22 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు చైనా వెలుపల 900 మందికి వైరస్ సంక్రమించినట్లు గుర్తించారు. హాంకాంగ్‌లో వైరస్‌ వల్ల మరొకరు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందినట్లైంది. ఫ్రాన్స్‌, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తైవాన్ దేశాల్లో ఇప్పటికే ఒక్కరు చొప్పున మరణించారు. 

 

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా రష్యా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు.  తమ దేశంలోకి వచ్చే చైనా పర్యాటకులు, విద్యార్థులు, పని వీసాలతో వచ్చే వారికి ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించారు. అయితే ఈ నిషేధం రష్యా విమానాశ్రయాల మీదుగా ప్రయాణం చేసే వారికి వర్తించదని పేర్కొన్నారు. మాస్కో సమయం ప్రకారం గురువారం రాత్రి 9గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. 

 

జపాన్‌ తీరంలో నిలిచిపోయిన నౌకలో ఉన్నవారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. గత 14రోజులుగా వీరంతా నౌకలోనే ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 542 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్ ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత 500 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. మరో 300 మంది అమెరికన్లను ఆ ప్రభుత్వం ఇప్పటికే సొంతదేశానికి తీసుకెళ్లింది. మరికొంత మందిని త్వరలో విడిచిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: