ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలోని నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో చేదు అనుభవం ఎదురైంది. తోట త్రిమూర్తులు కారు నుండి దిగుతున్న సమయంలో ఒక వ్యక్తి తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి చేశాడు. నిన్న మధ్యాహ్నం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, తోట త్రిమూర్తులు కలిసి ద్రాక్షారామానికి వచ్చారు. 
 
కె. గంగవరం మండలంలోని మసకపల్లికి చెందిన ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులు కారు దిగుతున్న సమయంలో చెప్పుతో దాడి చేయటానికి ప్రయత్నాలు చేశాడు. తోట త్రిమూర్తులు భద్రతా సిబ్బంది క్షణాల్లోనే స్పందించి ఇజ్రాయెల్ ను అక్కడి నుండి నెట్టివేశారు. ఇజ్రాయెల్ ఎందుకు తోట త్రిమూర్తులుపై దాడి చేసే ప్రయత్నం చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కొన్ని రోజుల క్రితమే వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో తోట త్రిమూర్తులు వర్గం చేరేందుకు నిన్న సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరు కావడానికి వెళుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఎమ్మెల్యే వేణు వర్గం నేతలే తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత సమయం పాటు గందరగోళ పరిస్థితి నెలకొనగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. 
 
మరోవైపు ఈ దాడి జరగటానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. గతంలో దళితులకు శిరోముండనం చేశారనే ఆరోపణలతో తోట త్రిమూర్తులుపై ఒక కేసు నమోదైంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులుపై దాడి చేశాడని మరికొందరు చెబుతున్నారు. దాడి చేసిన ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులు అధికారంలో ఉన్న పార్టీలో చేరుతూ శిక్షను తప్పించుకుంటున్నాడని ఆరోపణలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాల వలనే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: