మొన్నటి ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఓటమి చంద్రబాబునాయుడుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. రాజకీయాల్లో గెలుపోటములను సహజంగానే తీసుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో తట్టుకోలేకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చేతిలో తగిలిన దెబ్బతో మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం ప్రజా చైతన్య యాత్రలో స్పష్టంగా బయటపడింది.

 

జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న నవమోసాలను జనాలకు చెప్పి చైతన్యం కలిగించటమే చంద్రబాబు ఉద్దేశ్యం. ఇందుకు ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుండి తన యాత్రను ప్రారంభించారు. పర్చూరులో ఉన్నది టిడిపి ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావే. ఏలూరికి పార్టీ క్యాడర్ పై మంచి పట్టుంది. కాబట్టి పార్టీ జనాలు, పబ్లిక్ కూడా హాజరయ్యారు. పార్టీ క్యాడర్, జనాలను ఉద్దేశించి మొదటి సభలో మాట్లాడుతూ ’మీరంతా మొన్నటి ఎన్నికల్లో వైసిపికే ఓట్లేశారు కదా’  అంటూ ప్రశ్నించారు.

 

ముందు చంద్రబాబు అడిగిన ప్రశ్న వారికి సరిగా అర్ధంకాలేదు. అయితే అర్ధమవ్వగానే లేదు లేదు అంటూ గట్టిగా కేకలేశారు. కానీ చంద్రబాబు మాత్రం నమ్మలేదు. నమ్మకపోగా ’నాకు తెలుసు మీరంతా వైసిపికే ఓట్లేశారు’ అంటూ రెట్టించటంతో ఏమి సమాధానం చెప్పాలో కార్యకర్తలకు అర్ధంకాలేదు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  యాత్రలు మొదలుపెట్టిన చంద్రబాబు పోయిన ఎన్నికల్లో మీరు జగన్ కే ఓట్లేశారనే క్యాడర్ ను పట్టుకుని బహిరంగంగా ప్రశ్నించటం ఏమిటో తెలీక నేతలు జుట్టు పీక్కుంటున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు, చినబాబు వైఖరి నచ్చని చాలామంది నేతలు, క్యాడర్ మొన్నటి ఎన్నికల్లో వైసిపికి ఓట్లేసింది నిజమే. వైసిపికి ఓట్లేయించటం ఇష్టంలేని నేతలు ఇళ్ళలో కూర్చున్నారు. టిడిపి వాళ్ళే వైసిపికి ఓట్లేయించేంత సీన్ ఎందుకు ఎదురైంది ?  పోలింగ్ మొదలైన తర్వాత టిడిపి నేతలు, క్యాడర్ మధ్యహ్నం 12 గంటలకే చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ లను వదిలేసి వెళ్ళిపోయారు. చంద్రబాబు పాలనపై నేతలు, క్యాడర్ లోనే ఇంతగా వ్యతిరేకత తెచ్చుకున్న చంద్రబాబు మళ్ళీ వాళ్ళని బహిరంగంగా నిలదీయటం ఏమిటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: