దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్క‌డ‌ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న చిన్న పొరపాటు ఎన్నో కుటుంబాలను రోడ్డున ప‌డేలా చేస్తుంది. రోడు రవాణా సంస్థ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఈ ప్రమాదాలను ఏమాత్రం అరికట్టలేక పోతున్నాయి.  ఈ రోజు ఉదయం తమిళనాడులో రెండు చోట్ల‌ ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 26 మంది మృతి చెందారు. సేలం జిల్లా ఓమలూరులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టు బస్సు, టెంపో వాహనం ఢీకొని ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి  క్షతగాత్రులను సేలం ఆస్పత్రికి తరలించారు. 

 

వీరంతా తీర్థయాత్ర కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మృతులను నేపాల్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇక మ‌రోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న కేరళ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సును కోయంబత్తూరు సమీపంలోని అవినాశి వద్ద కంటైనర్ ఢీకొంది. 

 

ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిందీ ఘటన. బాధితుల్లో చాలామంది త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ప్రమాదంలో కంటైనర్‌ క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధితులకు సత్వర సాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలక్కాడ్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయ చర్యలు చేపడతామని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: