అన్ని రంగాల్లాగానే మీడియా కూడా దారి తప్పుతోంది. ప్రతి మీడియా హౌజూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోతున్న రోజులువి. నిఖార్సుగా ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా కేవలం ప్రజల పక్షమే నడిచే పత్రికలు, టీవీలు ఏవీ అని ప్రశ్నించుకుంటే.. జవాబు చెప్పడం కష్టమే. అయితే.. ఇందులో కొన్ని మీడియాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి. పార్టీల కరపత్రాల్లా తయారవుతున్నాయి.

 

అదే సమయంలో మీడియా ధోరణిపై నాయకుల అసంతృప్తి కూడా పెరుగుతోంది. అందుకేనేమో తాజాగా ఓ నాయకుడు మీడియా కంపెనీలను ముంబై రెడ్ లైట్ వేశ్యల కంటే దారుణమంటూ కామెంట్ చేశాడు. ఆ పెద్ద మనిషి ఎవరంటారా.. డీఎంకే రాజ్యసభ ఎంపీ ఆర్‌ ఎస్‌ భారతి. తాజాగా మీడియాను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేశాడు. ఇంతకీ అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. బ్రాహ్మణీయతను వ్యతిరేకించే డీఎంకే ఇటీవల కాస్త దూకుడు తగ్గించింది. ఆ మధ్య స్టాలిన్ ఏదో గుడికి కూడా వెళ్లాడు.

 

దీనికి తోడు ఇటీవల డీఎంకే ప్రశాంత్ కిషోర్ సేవలు కూడా వినియోగించుకుంటోంది. ఈ అన్నింటిపైనా తమిళ పత్రికలు వ్యంగ్యంగా వార్తలు రాస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ భారతికి కోపమొచ్చేసింది. ఆయన ఏమన్నాడంటే.. “ ఈ జర్నలిస్టులకు వేరే పనేమీ లేదు…వేరే వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు అక్కరలేదు…అదే ప్రశాంత్ కిషోర్‌తో కేజ్రీవాల్ పని చేయించుకున్నాడు…గతంలో మోడీ కూడా వాడుకున్నాడు…నీ మీడియాకు అభ్యంతరం అనిపించలేదు…డీఎంకేకు పనిచేస్తున్నాడు అనేసరికి పెద్ద చర్చలు పెట్టేస్తున్నారు, రాసేస్తున్నారు…

 

నేను ఓపెన్‌గా చెబుతున్నా … మీడియా వంటి స్కౌండ్రల్స్ ఇంకెవరూ ఉండరు… ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో నడిచే కంపెనీల్లాగా మీడియా కంపెనీలను నడిపిస్తున్నారు … అంతా డబ్బు ప్రభావమే…అరె , మన దళపతి స్టాలిన్ గుడికి వెళ్తే కూడా ఓ పెద్ద డిబేట్ నడిపిస్తారు, అసలు వేరే విషయాలే లేవా చర్చించటానికి, రాయటానికి..?’’ అంటూ రెచ్చిపోయాడు భారతి.

 

ఆ తర్వాత చెన్నై ప్రెస్ క్లబ్ దీనిని ఖండించింది .. చాలా విమర్శలొచ్చాయి. దాంతో కాస్త తగ్గాడు. కొందరి మనోభావాలు దెబ్బతింటే సారీ … కలైంగర్ కరుణానిధి చేసిన మంచి పనుల వల్ల ఉపయోగాలను చెప్పడమే నా ఉద్దేశం’’ అన్నాడు….. ఏదేమైనా డీఎంకే ఎంపీ భారతి చేసిన వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా ప్రస్తుత మీడియా పరిస్థితికి అద్దం పడుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: