పార్టీ పరిస్థితి రోజు రోజుకి అగమ్యగోచరంగా తయారవుతున్నా.. పార్టీని బతికి బట్టకట్టించి ఒక ఒడ్డున పడేయ్యాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రావడం లేదు. ఎవరికి వారు గ్రూపు తగాదాలతో పార్టీలోని సొంత నాయకులే లక్ష్యంగా పావులు కదుపుతూ వారికి నష్టం చేకూరుస్తున్నారు.సొంత నాయకులే  కాంగ్రెస్ పరిస్థితిని మరింతగా దిగజారుతున్నారు. ఈ విషయంలో వారు వీరు అనే భేదం లేకుండా పార్టీలోని సీనియర్ నాయకులు అంతా ఇదేవిధంగా వ్యవహరిస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం అటుంచి మరింతగా దిగజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉండాల్సి ఉన్నా.. కనీసం రెండో స్థానంలో కూడా ఆ పార్టీ నిలబడ లేక పోవడానికి కారణం నాయకుల మధ్య ఆధిపత్య పోరు. 


ఇది బహిరంగ రహస్యం. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యవహారం ఎలా ఉన్నా పార్టీలోని ముగ్గురు ఎంపీల పనితీరుపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వారే మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన రేవంత్ రెడ్డి, భువనగిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నల్గొండ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పేరు తీవ్ర స్థాయిలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా బిజీగా పార్టీ వ్యవహారాల్లో తిరుగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రం పిసిసి అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని ఆశతో సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఉత్తమ్, వెంకట్ రెడ్డి ఒకరికి ఒకరు తరచుగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.


 ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా ఆయన ఏ మాత్రం లెక్కచేయకుండా తానే కాబోయే పిసిసి అధ్యక్షుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరచుగా పార్టీ శ్రేణులకు చెబుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నా పిసిసి అధ్యక్ష పదవి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయంతోనే పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ ముగ్గురు పార్టీ వ్యవహారాల కన్నా, తమ సొంత ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తూ కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను మరింత దీన స్థితికి తీసుకు వస్తున్నారని పార్టీ శ్రేణులలో అభిప్రాయం  నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: