ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. ఇప్పుడు కోవిడ్‌-19 పేరుతో వ్యవహరిస్తున్న ఈ వైరస్‌ చైనాలో పాటు దాదాపు 28 దేశాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా పేరువింటేనే వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఫేస్‌మాస్కులు, సూట్లు, చేతికి గ్లవ్స్ ధరించి ఎలాంటి వస్తువులను, మనుషులను తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, చైనాలో ఓ మహిళ మాత్రం వింతగా ప్రవర్తించింది. లుజుహూ నగరంలో ఓ మహిళ జిరాఫీ దుస్తులు వేసుకుని తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆ మహిళ మందుల కోసం హాస్పిటల్‌లోని మెడికల్ విభాగానికి వచ్చింది. ఆ సమయంలో ఆమెను చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ మహిళ చిన్న పిల్లలు వేసుకునే జిరాఫీ డ్రస్‌ వేసుకొని మెడికల్ షాప్‌కు రావటంతో అంతా షాక్‌ అయ్యారు.  ఇదేంటి ఆమె చిన్న పిల్లల్లా జిరాఫీ డ్రస్ వేసుకుని తిరుగుతోందని అనుకున్నారు. ఆమె ఆ డ్రస్‌ వేసుకోవటం వెనుక కారణం లేకపోలేదు.

 

ఈ సంఘటన తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె`మార్కెట్లో మాస్కులు, సూట్లు లభించడం లేదు. వేరే మార్గం లేక, నేను ఇలాంటివి రెండు సూట్లు (జంతువులు, గ్రహాంతరవాసి) కొన్నాను` అని వెల్లడించింది. కాళ్ల నుంచి తలవరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచుతుందనే ఉద్దేశంతో ఆమె ఆ జిరాఫీ డ్రస్ వేసుకుందని అధికారులు తెలిపారు. అయితే, అలాంటి దుస్తులు కరోనా వైరస్ నుంచి కాపాడలేవని డాక్టర్లు అంటున్నారు.

 

కోవిడ్-19 వైరస్ కారణంగా ఇప్పటివరకు 2,004 మంది ప్రాణాలను బలితీసుకుంది. 74,185 మంది ఈ వ్యాధితో చికిత్సతో పొందుతున్నారు. హుబీ ఎపి సెంటర్ వివరాల ప్రకారం బుధవారం ఒక్కరోజే చైనాలో 1,693 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ జరుగగా, 132 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: