ఈ మ‌ధ్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలకు అంతే ఉండటంలేదు. కారుచౌక బేరమని ప్రకటనలు గుప్పిస్తూ అమాయకులను మాటలతో బురిడీ కొట్టిస్తూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే రోజురోజుకు నకిలీ వెబ్‌సైట్లు కూడా పెరిగిపోతున్నాయి.  ఆ నకిలీ సైట్‌లో ఆఫర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. నమ్మలేని ఆఫర్లు ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు నిజమని నమ్మి కొంద‌రు ఆర్డర్ ప్లేస్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు. ఇక తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి కొద్దిరోజుల క్రితం ఓ వ్య‌క్తి కాల్ చేసి తనకు ఫలానా కంపెనీకి చెందిన కండోమ్స్ ప్యాకెట్ కావాలని అడిగాడు. 

 

రాంగ్ కాల్ అనుకున్న ఆమె దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే రెండ్రోజుల తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తన గర్ల్‌ఫ్రెండ్‌కి లోదుస్తులు కావాలని అసభ్యంగా మాట్లాడాడు. అప్పటినుంచి ఆమెకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ రావడం స్టాట్ అయ్యాయి. దీంతో అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఆమె అయోమ‌యంలో ఉండిపోయింది. అలాగే ఫలానా వెబ్‌సైట్లో వస్తువులు ఆర్డర్ చేశామంటూ కాల్స్, మెసేజ్‌లు రావడంతో ఆమె షాకైంది. దీంతో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి స్నేహితుల‌తో క‌లిసి.. ఆ యువ‌తి రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలోనే అస‌లు విష‌యం తెలుసుకున్న ఆ యువ‌తి కంగుతింది. ఎవరో కేటుగాళ్లు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వినియోగించి ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసినట్లు తెలుసుకుంది. 

 

అందులో మహిళల లోదుస్తులు, కండోమ్ ప్యాకెట్లు, సెక్స్ టాయ్స్ అమ్ముతున్నట్లు గుర్తించింది. ఆ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ప్రకటన ఉండటంతో చాలామంది ఆసక్తి చూపి ఆర్డర్లు చేశారు. అందులో ఆర్డర్ ఇవ్వగానే బాధితురాలి మొబైల్‌కి మెసేజ్‌లు వస్తున్నాయి. డబ్బులు చెల్లించిన వారు ఆర్డర్ రాకపోతే ఆమె మొబైల్‌కి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీంతో కుంగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: