అహ్మదాబాద్‌లో నాకు 70 లక్షల మంది స్వాగతం పలకబోతున్నారు...! స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాటలివి..! ఇంతకీ నిజంగానే 70 లక్షల మంది వెల్‌కమ్ చెప్పబోతున్నారా...? అసలు అది సాధ్యమేనా...? మోడీ ట్రంప్‌కు ఏం చెప్పారు..? అసలు రోడ్‌షోలో పాల్గొనే ప్రజలు ఎంతమంది....?

 

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మొతేరా స్టేడియం వరకు 70 లక్షల మంది స్వాగతం పలకబోతున్నట్లు ట్రంప్‌కు మోడీ చెప్పారట. ట్రేడ్ డీల్ కుదురుతుందో లేదో తెలియదు గానీ... ఈ  ఈవెంట్ విషయంలో మాత్రం ట్రంప్ చాలా ఉత్సుకతతో ఉన్నట్లు ఆయన మాటల్ని బట్టి అర్ధమవుతుంది.  అయితే ట్రంప్ చెప్పినట్టు ఏడు మిలియన్ల మంది స్వాగతం చెప్పడానికి వస్తారా...? నిజంగానే గుజరాత్ ప్రభుత్వం  ఆమేరకు ఏర్పాటు చేస్తుందా...? మోడీ ట్రంప్‌కు ఏం చెప్పారో... ఆయన ఏం అర్ధం చేసుకున్నారో తెలియదు గానీ... 70 లక్షలతో స్వాగతం చెప్పడం మాత్రం అసాధ్యమంటున్నారు అధికారులు.  

 

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఈవెంట్ జరిగే మొతేరా క్రికెట్ స్టేడియం వరకు 22 కి.మీ దూరం ఉంటుంది. ఈ మొత్తం మార్గంలో మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు ప్రెసిడెంట్ ట్రంప్.   అహ్మదారాబాద్‌లోని మురికి కూపాలు, పేదలు నివసించే ప్రాంతాలు ట్రంప్‌కు కనిపించకుండా రోడ్డుకు ఇరువైపులా గోడను కూడా కడుతున్న ప్రభుత్వం... దారి పొడవునా... స్వాగతం చెప్పేందుకు ప్రజలను కూడా మోహరిస్తోంది.  అయితే 70 లక్షల మంది స్వాగతం చెప్పే అవకాశం ఎంతమాత్రం లేదంటున్నారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. 

 

అహ్మదాబాద్ జనాభా 55 లక్షలలోపే ఉంటుంది. అలాంటప్పుడు 70  లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేస్తున్నారు. రాజకీయ పార్టీల సభలకు జనాన్ని తరలించినట్టు ట్రంప్‌కు స్వాగతం చెప్పేందుకు కూడా తరలిస్తారా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. 70 లక్షల మందితో స్వాగతం పలకడానికి ట్రంప్ ఏమైనా దేవుడా అని కాంగ్రెస్ రాజకీయ విమర్శలు కూడా చేస్తోంది. అయితే ట్రంప్‌ 70 లక్షలు అని ఎందుకు చెప్పుకుంటున్నారో గానీ... స్వాగతం పలికేందుకు లక్ష మంది వరకు రావొచ్చని అహ్మదాబాద్ కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: