దాదాపు మూడు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. సురేష్ అనే రైతు ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ ను తీసుకొనివెళ్లి విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎమ్మార్వో విజయారెడ్డి చనిపోయింది. విజయారెడ్డి ఘటన తరువాత కొంతకాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తహశీల్దార్ లకు పెట్రోల్ పోసి చంపుతామనే బెదిరింపులు పెరిగాయి. 
 
తాజాగా భూవివాదం నేపథ్యంలో సంగారెడ్డి తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఒక వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేశాడు. చాలా రోజుల నుండి భూ వివాదానికి సంబంధిన సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని కానీ సమస్య పరిష్కరించటం లేదని ప్రసాద్ అనే వ్యక్తి చెబుతున్నాడు. తనకు న్యాయం చేయాలని న్యాయం చేయని పక్షంలో కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకొని చనిపోతానని ప్రసాద్ కార్యాలయ సిబ్బందిని బెదిరించాడు. 
 
ప్రసాద్ తహశీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ తో వచ్చి నిప్పు పెట్టుకుంటానని బెదిరించడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్ కు అతని సోదరులతో కొన్నేళ్లుగా భూ వివాదానికి సంబంధించిన గొడవ జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రసాద్ వీఆర్వోను సంప్రదించాడు. కానీ వీఆర్వో ప్రసాద్ తో దురుసుగా ప్రవర్తించటంతో పాటు సమస్యను పరిష్కరించలేదు. 
 
ఆ తరువాత సమస్యను పరిష్కరించాలని మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రసాద్ తిరుగుతూనే ఉన్నాడు. కానీ వారి నుండి సరైన స్పందన లేకపోవడంతో నిరాశ చెందిన ప్రసాద్ ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొనివచ్చి పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతని చేతిలోని బాటిల్ ను లాక్కున్నారు. ఆ తరువాత అతనికి నచ్చజెప్పి అక్కడినుండి పంపించేశారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: