అధికారానికి దూరం కావడమో లేక టీడీపీలో పరిస్థితులు సరిగా లేకపోవడమో గానీ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి, ఓటమి పాలై, ఆ పార్టీని వదిలేసి అధికార వైసీపీలోకి వచ్చారు. అయితే వైసీపీలోకి వచ్చాక ఏమన్నా పరిస్థితులు సరిగా ఉన్నాయంటే, అది లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి రామచంద్రాపురం వైసీపీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి.

 

వైసీపీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, తోట త్రిమూర్తులు వర్గాలకు అసలు పొసగడం లేదు. అసలు తోట వైసీపీలోకి వచ్చే ముందే వేణు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే వైవీ సుబ్బారెడ్డి పట్టుబట్టి మరి తోటని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఇక తోట వైసీపీలోకి ఎంటర్ అవ్వడమే రచ్చ మొదలైంది. ఏదొక సందర్భంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

 

తాజాగా కూడా తోట త్రిమూర్తులపై వేణు వర్గం దాడికి దిగింది. తోట త్రిమూర్తులు వర్గాన్ని వైసీపీలో చేర్చుకునేందుకు జిల్లాకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలు వచ్చారు. వారితో పాటు తోట త్రిమూర్తులు కూడా వచ్చారు. ఇదే సమయంలో వేణు వర్గం కూడా వచ్చి పెద్ద రచ్చ చేసింది. తోటని అడ్డుకుంది. ఒకానొక సమయంలో తోటపై చెప్పుతో దాడి చేశారనే వార్తలు వచ్చాయి. అయితే గతంలో తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు కావడంతో దళితుడైన ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులు పై దాడి చేశాడని అంటున్నారు.

 

ఆ కేసు అలాగే ఉండటంతో శిక్ష పడకుండా ఉండేందుకు తోట వైసీపీలోకి వచ్చారని దళిత వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇక ఇలాంటి పరిణామాలతో తోట చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు.  ఈ క్రమంలోనే ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదని జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి చూడాలి తోట వైసీపీలోనే కొనసాగుతారో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: