గత ఆరేళ్లుగా కంచుకోట లాంటి గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. కొడాలి నాని ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్లారో అప్పటి నుంచి టీడీపీకి సరైన నాయకత్వం లేక సతమవుతుంది. 2014 ఎన్నికల్లో గుడివాడపై పట్టున్న రావి ఫ్యామిలీ నుంచి రావి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి ఎలాగోలా పోటీకి దించారు. కానీ కొడాలి ముందు రావి నిలబడలేకపోయారు. ఓటమి పాలయ్యారు. సరే ఓడినా, వెనక్కి తగ్గకుండా ఐదేళ్లు పని చేసుకుని 2019 ఎన్నికలకు సిద్ధమైతే, చంద్రబాబు మాత్రం రావిని పక్కనబెట్టేసి దేవినేని అవినాష్‌ని నాని మీద పోటీకి పెట్టారు.

 

ఇక అవినాష్ కూడా దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయాక టీడీపీని సైతం వదిలేసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో గుడివాడలో టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. అయితే స్థానిక ఎన్నికలు రానుండటంతో చంద్రబాబు మళ్ళీ రావినే నియోజకవర్గ ఇన్ చార్జ్‌గా నియమించారు. ఇన్ చార్జ్ పదవి రావడమే రావి రంగంలోకి దిగారు. పార్టీ కేడర్‌ని యాక్టివ్ చేసే పనిలో పడ్డారు.

 

మామూలుగానే గుడివాడలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఇన్ని రోజులు సరైన నాయకుడు లేక స్తబ్దుగా ఉండిపోయారు. ఇప్పుడు రావిని ఇన్‌చార్జ్‌గా పెట్టడంతో, స్థానిక ఎన్నికల్లో పని చేసేందుకు సిద్ధమయ్యారు. నానికి మరి పోటీ ఇచ్చే స్థాయిలో కాకపోయిన, తమకు అనుకూలంగా ఉన్నా ప్రాంతాల్లో సత్తా చాటాడానికి రెడీ అయ్యారు.  ఎలాగో నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ గుడివాడలో వైసీపీనే గెలుస్తుంది.

 

దీంతో ఆ మున్సిపాలిటీపై టీడీపీ ఆశలు వదిలేసుకుని పని చేయాలి. తమ బలం ఎక్కువగా ఉన్నా పంచాయితీలు, ఎం‌పి‌టి‌సి స్థానాలపై దృష్టి పెట్టుకుని ముందుకెళ్లాలి. అలాగే తమకు ముందు నుంచి కంచుకోట ఉన్నా గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానాన్ని చేజారిపోకుండా చూడాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్లవల్లేరు మండలంలో నానికే మెజారిటీ వచ్చింది. దీని బట్టి చూస్తే ఆ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కాస్త గట్టిగా కష్టపడితే టీడీపీకి గెలిచే అవకాశం ఉంది. మొత్తం మీదైతే గుడివాడలో యాక్టివ్ అయిన టీడీపీ కేడర్...స్థానిక పోరులో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: