హైదరాబాద్‌లో ఉంటున్న 126 మంది రోహింగ్యాలకు ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసింది. రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇప్పించిన కేసులో నిందితుడైన సత్తార్‌కు కూడా... తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అసలు ఈ సత్తార్‌ ఎవరు? రోహింగ్యాలకు ఎప్పుడు ఆధార్‌ కార్డులు ఇప్పించాడు? హైదరాబాద్‌లో అసలేం జరిగింది?

 

హైదరాబాద్‌లో మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు అధికంగా ఉన్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతంలోని శరణార్థుల క్యాంపుల్లో వీరు తలదాచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆరు వేలకు పైగా రోహింగ్యాలు... భారత ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు పొందేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. కొందరు దళారులకు డబ్బు ఇచ్చి... తప్పుడు పత్రాలతో అధికారిక గుర్తింపు కార్డులు పొందాలనేది చాలా మంది తాపత్రయం. అలా అక్రమంగా గుర్తింపు కార్డులు పొందిన రోహింగ్యాలపై... బాలాపూర్ పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. 43 కేసుల్లో చాలా మంది రోహింగ్యాలను అరెస్ట్‌ చేసిన పోలీసులు... వారిని రిమాండ్‌కు తరలించారు. 

 

ఇక కంచన్ బాగ్ పరిధిలో ఉండే మరికొందరు రోహింగ్యాలు కూడా తప్పడు పత్రాలతో ఆధార్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో రెండేళ్ల కిందట సీసీఎస్  పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు రోహింగ్యాలతో పాటు... వారికి గుర్తింపు కార్డులు ఇప్పించిన సత్తార్ ఖాన్‌ను కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
సాధారణంగా రోహింగ్యాల దగ్గర శరణార్థి గుర్తింపు కార్డులు ఉంటాయి. వాటిని దాచిపెట్టి ఆధార్‌ కార్డులు తీసుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం. అందుకే CCS పోలీసులు రోహింగ్యాలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. వారి ఆధార్‌ కార్డులు రద్దు చేసి... తిరిగి మయన్మార్‌ పంపేయాలని UIDAIకి సమాచారం ఇచ్చారు. 

 

అయితే... అక్రమంగా ఆధార్‌ పొందిన కేసులో రిమాండ్‌కు వెళ్లిన వంద మందికి పైగా రోహింగ్యాలు... ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వారిలో చాలా మంది కనిపించకుండా పోయారు. తాజాగా బాలాపూర్‌లో ఉంటున్న రోహింగ్యాలు కూడా ఆధార్‌ కార్డులు పొందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు... UIDAIకి విషయాన్ని చేరవేశారు. విచారణ జరిపిన ఆధార్‌ సంస్థ... 126 మంది రోహింగ్యాలు ఆధార్‌ తీసుకున్నట్లు గుర్తించి... ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. వారికి ఆధార్‌ కార్డులు ఇప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్తార్‌కు కూడా నోటీసులు ఇచ్చి... విచారణకు రావాలని ఆదేశించింది. దాంతో చాలా మంది రోహింగ్యాలు బాలాపూర్‌ ఫంక్షన్ హాల్‌ దగ్గరికి వచ్చారు. కానీ విచారణను రద్దు చేసిన ఆధార్‌ సంస్థ... మే నెలలో రావాలని కోరింది.

 

మరోవైపు ఇప్పుడు జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చిన రోహింగ్యాలు ఎక్కడి వెళ్లారు అనేది సస్పెన్స్‌గా మారింది. ఇండియాలోనే మరో ప్రాంతానికి వెళ్లారా? లేక తిరిగి సొంత దేశమైన బర్మాకు వెళ్లారా? అన్న దానిపై పోలీసులకు కార్లీటి లేకుండా పొయింది. దాంతో వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద రోహింగ్యాల వ్యవహారం అటు ఆధార్‌ సంస్థను, ఇటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: