పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం మృతి వెనక ఎలాంటి కుట్రకోణం లేదని పోలీసులు తేల్చారు. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ కెనాల్లో పడి కుటుంబం దుర్మరణం చెందినట్లు తెలిపారు. 20 రోజుల క్రితమే ప్రమాదం జరిగినప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో.. ఈ దుర్ఘటన వెలుగు చూడలేదు.  అయితే  కెనాల్లో ఓ బైక్ పడడంతో నీటిని నిలిపివేయడంతో  కారు బయటపడింది. కారు నెంబర్ ఆదారంగా మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా గుర్తించారు. 

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు సమీపంలో కాకతీయ కెనాల్లో కారుప్రమాదంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం దుర్మరణం పాలైంది. ఈప్రమాదంలో ఎమ్మెల్యే సోదరి రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కూతురు సహస్ర నీటిలో మునిగి చనిపోయారు. ఇటీవలే కెనాల్‌లో ఓ బైక్‌ పడటంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. దీంతో కెనాల్‌లో కారు బయటపడింది. కారులో కుళ్లిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు ఉన్నట్లు గుర్తించగా, కారు నెంబర్‌ ఆధారంగా వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా తేల్చారు. గత నెల 27 నుంచి రాధిక కుటుంబం కనిపించడం లేదని తెలుస్తోంది. తమ వద్ద ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. కారులో ఎమ్మెల్యే సోదరి రాధికతోపాటూ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్త్ర ఉన్నారు. 

 

జనవరి 27న ఇంటి నుంచి వెళ్లాక, మళ్లీ ఎవరికీ సత్యన్నారాయణ కుటుంబం కనిపించకపోయినా.. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పిన ముగ్గురూ... బంధువులకు, స్నేహితులకు ఫోన్ లో కూడా అందుబాటులోకి రాలేదు.  అయితే వెళ్లేముందు చివరిగా సత్యనారాయణ రెడ్డి.. తన ఇంటిలో అద్దెకు ఉన్నవారికి చెప్పి బయలుదేరినట్లు తెలుస్తోంది. 26వ తేదీన ఎరువుల దుకాణంలో పనిచేసే నర్సింగ్‌ను పిలిపించుకుని ఇంట్లోని దుప్పట్లు, గ్యాస్ స్టవ్‌, రైస్‌ కుక్కర్, ప్లేట్లు కారులో పెట్టించుకుని వెళ్లారు. తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నర్సింగ్‌కే ఫోన్ చేసి... ఫోన్ బ్యాలెన్స్‌ అయిపోయిందని, రీఛార్జ్‌ చేయమని చెప్పి చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి.సత్యనారాయణరెడ్డి కుటుంబం విదేశాలకు గానీ, విహార యాత్రలకు గానీ వెళ్లి ఉంటారని, తిరిగి వస్తారని బంధువులు, స్నేహితులు భావించారు. అయితే గుమస్తా నర్సింగ్‌కి అనుమానం రావడంతో రాధిక సోదరుడు అయిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తలుపులు బద్దలు కొట్టి ఇంటిలో చూసినా ఎలాంటి వివరాలు తెలియరాలేదు.

 

రాధిక కుటుంబం మృతిపై విచారణ పూర్తి చేసిన పెద్దపల్లిపోలీసులు.. కారుప్రమాదమే కారణమని తేల్చారు. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లో పడినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిమృతిపై వచ్చిన కథనాలు అవాస్తవమన్నారు. కొడుకు అకాల మరణం తర్వాత సత్యన్నారాయణ రెడ్డి.. చాలా వ్యాపారాల నుంచి తప్పుకున్నారని అతని దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్నవారు చెబుతున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం ఇలా దుర్మరణం పాలవ్వడం కలచివేస్తోందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: