లోకంలో కుల మతాల చిచ్చు కొమ్ములు ధరించి కుమ్ముతూ ఉంటే.. పాకిస్దాన్ వాడు అంటాడు, మా మతం వారికి మీ దేశంలో అవమానాలు చాలా జరుగుతున్నాయని. వాడికి తెలుసా ఇక్కడ అన్నదమ్ముల్లా భారతీయులు కలిసిమెలసి ఉంటున్నారని. ఎవడో చెప్పాడని, మానవ బాంబుల్లా మారి ఇక్కడ మారణహోమాన్ని సృష్టిస్తున్నారు.. ఇకపోతే ఈ మధ్యకాలంలో, రాజకీయాల్లో గాని, మిగతా అన్ని చోట్ల కుల ప్రస్తావన చాలా వినబడుతుంది..

 

 

అసలు కులం అంటే ఏంటి..? అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినప్పుడు నీకు తెలుసా కులం అంటే.. ఒక వేళ తెలిస్తే ఏం చేసే వాడివి. దళిత కులంలో నిన్ను పుట్టిస్తున్నందుకు చంపేస్తావా.. లేదా ఈ తల్లిదండ్రులు వద్దని వదిలేస్తావా..? ఇకపోతే నీ కడుపు నింపే రైతు నీ కులం వాడు కాదని తెలిస్తే నరికేయ్..? లేక నీ గుమ్మంలో రోజు పాలు పోసే వాడిది ఏ కులమో కనుక్కుని వాడు మీ వాడు కాకపోతే చంపెయ్.. నువ్వు బయట తినే తిండి వండి.. వడ్డించే వారెవరో.. ఒకవేళ వాళ్ళు నీ వాళ్ళు కాకపోతే కోసెయ్.

 

 

ఇదంతా ఎందుకు నీ పిల్లలకు పాఠాలు చెప్పే స్కూల్ టీచర్ ఏ కులమో కనుక్కుని నీది కాకపోతే నూతిలో తోసెయ్....నువ్వు వేసుకున్న బట్టలు కుట్టిన వారు ఎవరో.. ఉతికారేసే వారు ఎవరో....వాళ్ళ కులం కనుక్కుని.. నీ బట్టలు చింపుకొని...వాళ్ళని బండకేసి బాది చంపెయ్... అంతే కాదు రోజు దేవునికోసం పువ్వులు ఇచ్చే అక్కని.. పొద్దున్నే నీకు రోజు పేపర్ వేసే తమ్ముని.. పాలపాకెట్ ఇచ్చే అన్నని.. నీకు జుట్టు కత్తిరించే మంగళిని.. రోగం వస్తే వైద్యం చేసే డాక్టర్‌ని వీళ్లందరిది నీ కులం కాకపోతే త్వరగా చంపెయ్.. ఇదంతా ఎందుకయ్య మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారిని శ్మశానానికి తీసుకెళ్లుతావు కదా అక్కడ కాటి కాపరిది కూడా మీ కులం కాకపోతే అదే చితిలోకి తోసెయ్..

 

 

ఇవన్ని జరుగవద్దంటే నీ మనసుకు అంటిన కులం, మతం అనే గజ్జిని తీసెయ్... నీలో దాగి ఉన్న మృగాన్ని చంపెయ్... మనముంటున్నది అడవిలో కాదని సంఘంలో అని గుర్తుకు రాని, నీ అజ్ఞానాన్ని కాల్చి బూడిద చేసెయ్.. నలుగురిని బ్రతికించడం నీవల్ల కాకుంటే..  నీ శరీరాన్ని, ఆత్మని చంపెయ్.. మరోజన్మ అంటూ ఉంటే అప్పుడైన మంచి బుద్ది, జ్ఞానం వస్తుందేమో...!

మరింత సమాచారం తెలుసుకోండి: