ఈ కాలంలో కాలేజ్ చదువు దాటిందంటే.. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో యువతీయువకులు ఇల్లు వదలాల్సిందే. మరి అమ్మాయిలను అలా ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో.. ఆమెకు ఎన్ని జాగ్రత్తలు చెబుతారో. అలా ఉద్యోగం కోసం వెళ్లిన ఓ కూతురికి తండ్రి చెబుతున్న జాగ్రత్తలు చూడండి.

 

" అప్పుడే ఏదో వెలితిరా తల్లీ.. ఇల్లంతా ఖాళీ అయిపోయినట్లు శూన్యం. సరైన జాగ్రత్తలైనా చెప్పకుండా ఇంత పెద్ద ప్రపంచంలోకి ఒంటరిగా వదిలేశామేమో అనే చింత.. ఎన్నో చెప్పాలనుంది.. చూడు నాన్నా.. ‘ఓ తండ్రిగా నేను చెప్పలేకపోతే ఇంకెవరూ నీకు చెప్పరు. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందేమో.

 

కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సుమా.. జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వాటిని కచ్చితంగా అంచనా వేయలేరు.

 

1. నీతో సఖ్యతగా లేనివారిపట్ల ద్వేషం పెంచుకోకు. తల్లిదండ్రులకు తప్ప.. నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత మరెవరికీ ఉండదని గుర్తుంచుకో. నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞత చూపడం మరచిపోవద్దు. అలాగే వాటిని జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ప్రతీ ఒక్కరు చేసే ప్రతీ పని వెనుకా ఏదో ఒక ఉద్దేశం ఉండే తీరుతుంది.

 

2. ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ వారు అలానే ఉండాలని లేదు.. జాగ్రత్త.. గుడ్డిగా.. వారిని ఆత్మీయులనుకుని నమ్మితే మనసు గాయపడే పరిస్థితి రావచ్చు. ఇది అర్థం చేసుకున్నరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా మనసు పెద్దగా గాయపడదు.

 

3. ఆడపిల్లవి అని మళ్లీ మళ్లీ గుర్తుచేయడం కాదు కానీ.. నేటి సమకాలీన సమాజంలో దానిని గుర్తుంచుకుని మెలగడం చాలా అవసరం చిన్నా.. అలా అని ఎక్కడా తగ్గొద్దు.. అనవసరంగా ఎక్కడా తలవంచొద్దు కూడా.

 

4. జీవితం చాలా చిన్నదిరా కన్నా.. ఒక్కరోజు వ్యర్థమైనా చక్కగా అనుభవించాల్సిన, సాధించాల్సిన.. తిరిగిరాని ఒకరోజును కోల్పోయానన్న విషయం గుర్తించు. ప్రతీ క్షణాన్ని అనుభవించడం నేర్చుకుంటే జీవితమంత అందమైనది మరేదీ ఉండదేమో!

 

5. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన భావన. కాలాన్నీ, మూడ్‌ను బట్టి వెలిసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించాననుకున్నవారు దూరమైపోయినప్పుడు కుంగిపోకు. ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాధలను అన్నింటినీ మాన్పేస్తుంది.. ప్రేమ అనేది ఒక భావన మాత్రమే. దాని సౌందర్యాన్ని, అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. జీవితంలో అవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచేకోద్దీ నీకే తెలుస్తుంది.

 

6. చాలామంది పెద్దగా చదవుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లి ఉండవచ్చు. కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పదానివైపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమే నీకున్న ఏకైక ఆయుధమని గుర్తుంచుకో.

 

7. నువ్వు ఎవరికైనా మాట ఇస్తే దానికి కచ్చితంగా నిలబెట్టుకో. అందరితోనూ మంచిగా ఉండు. కానీ అందరూ నీతో మంచిగా ఉంటారని ఆశించకు.

 

8. లోకమంతా చెడ్డది కాదు.. అలాగని మరీ మంచిదీ కాదు.. ‘యద్భావం తద్భవతి’ అంటారు పెద్దలు. నోరు మంచిదైతే.. ఊరుమంచిదవుతుంది తప్పకుండా.

 

9. ఎంత తక్కువ కాలమైనా కానీ, మనం కలిసి ఉన్న కాలాన్ని పదిలంగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలీదు కదా కన్నా..

 

"ఆడపిల్ల ఎన్నాళ్లు పెంచినా 'ఆడ' పిల్లే కాని 'ఈడ'పిల్ల కాదు. ఎప్పుడో ఒకప్పుడు అత్తవారింటికి పంపక తప్పదు. అది ప్రకృతి ధర్మం కూడా.. ఈరోజు వెళ్లినప్పుడు మళ్లీ వస్తావనే ఆశ ఉంది. కానీ, రేపు పెళ్లయి వెళ్లిపోతే శాశ్వతంగా ‘ఆడ’పిల్లవైపోతావు కదా..

అప్పుడు ఎలాగూ గుండెలనిండా కన్నీళ్లే..

 

వియోగం ఎలాంటివారినైనా నిస్సహాయుల్ని చేస్తుంది. ఎదో తెలియని స్తబ్ధత గుండెనిండా పేరుకుపోతుంది.

నిజమే.. రైలు వెళ్లిపోగానే ఖాళీ అయిపోయిన స్టేషన్‌లా బావురుమంటూ కనిపిస్తోందిరా అప్పుడే మన ఇల్లు..

త్వరగా వచ్చేయ్..

ఎదురుచూస్తూ ఉంటాం నాన్నా..

ఇట్లు.. మీ నాన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: