ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో హామీ అమలు దిశగా చర్యలు చేపట్టారు. గతంలో సీఎం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపునకు సంబంధించిన కొత్త జీవోను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, వ్యవసాయంలో నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేవారు. 
 
వైసీపీ ప్రభుత్వం 2019 సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తాజాగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 35.55 కోట్ల రూపాయలు పరిహారం విడుదల చేసింది. 2019 జూన్ నెల 1వ తేదీ తరువాత ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఈ పరిహారం అందనుంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య 2019 జూన్ నెల 1వ తేదీ తరువాత బలవన్మరణాలకు పాల్పడిన 627 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఈ పరిహారాన్ని బాధిత కుటుంబం తప్పితే మరెవరూ తీసుకోకుండా చర్యలు తీసుకుంటోంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉండాలని సీఎం జగన్ పరిహారాన్ని పెంచటంతో పాటు తక్కువ సమయంలో రైతుల కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నారు. 
 
సీఎం జగన్ గతంలోనే ఎక్కడైనా రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే మొదట కలెక్టర్ స్పందించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వం అని జగన్ చెప్పారు. వైసీపీ పాలన సానుభూతితో, మానవీయతతో ఉంటుందని కుటుంబంలో మనిషి చనిపోయిన సమయంలో ప్రభుత్వం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: