ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లాలో నకిలీ కరెన్సీ బారిన పడి అమాయకపు ప్రజలు మోసపోతున్నారు. మోసగాళ్లు చిల్లర కావాలంటూ వచ్చి మోసాలు చేస్తూ ఉండటం గమనార్హం. చిల్లర కావాలంటూ వచ్చి ఒక వ్యక్తి డెయిరీ యజమాని దగ్గరనుండి 31,000 రూపాయలు కాజేశాడు. నకిలీ కరెన్సీ బారిన పడి మోసపోయానని గ్రహించిన డెయిరీ యజమాని లబోదిబోమంటున్నాడు. ఒంగోలు జిల్లాలో ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
పూర్తి వివరాలోకి వెళితే వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఒంగోలులోని కూరగాయల మార్కెట్ దగ్గర దొడ్ల పాల డెయిరీ ఫామ్ ను నడుపుతున్నాడు. నిన్న రాత్రి ఒక వ్యక్తి తన దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయని తనకు చిల్లర కావాలని కోరాడు. షాపు యజమాని దగ్గర కూడా అదే సమయంలో ఎక్కువ మొత్తంలో చిల్లర ఉండటంతో  చిల్లర ఇవ్వడానికి అంగీకరించాడు. 
 
షాపుకు వచ్చిన వ్యక్తి తన దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లు 68 షాపు యజమానికి ఇచ్చాడు. సుబ్బారెడ్డి 100 రూపాయల నోట్లు 340 షాపుకు వచ్చిన వ్యక్తికి ఇచ్చి లెక్క పెట్టుకోవాలని కోరాడు. అవతలి వ్యక్తి మాత్రం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయాడు. సుబ్బారెడ్డికి అతనిపై అనుమానం రావడంతో వెంటనే ఆ వ్యక్తి ఇచ్చిన 500 రూపాయల నోట్లను పరిశీలించాడు. 
 
ఆ నోట్లలో మొదటి ఆరు నోట్లు ఒరిజినల్ కరెన్సీ కాగా మిగిలిన నోట్లు అన్నీ జిరాక్స్ నోట్లు అని సుబ్బారెడ్డికి అర్థమైంది. షాక్ కు గురైన సుబ్బారెడ్డి వెంటనే ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎలా మోసపోయాడో వివరించి కేసు నమోదు చేసుకోవాలని పోలీసులను కోరాడు. పోలీసులు సుబ్బారెడ్డి 31,000 రూపాయలు మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: