అమ్మ అవ్వడం ఒక వరం. మాతృత్వంలో మాధుర్యాన్ని అందుకోలేని వాళ్లు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఈ పద్ధతినే సరోగసీ అంటారు. దీనికోసం ఇండియాలో బేబీ ఫ్యాకర్టీ పేరిట పెద్ద ఆసుపత్రే ఉంది.దాని నిండా ఇతరులకు బిడ్డను కనిచ్చే తల్లులే ఉంటారు. సరోగసీ మీద ఇప్పటికీ ఎన్నో వాదనలు వచ్చాయి. మొన్నటికి మొన్న ముంబైలో ఒక సంఘటన జరిగింది. సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఓ నర్సుకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకు గాను అద్దె గర్భం ద్వారా బిడ్డను కనాలనుకుంది. ఒకామెతో ఒప్పందం చేసుకుంది. ఆమెను, పుట్టిన బిడ్డను చూసుకోవడానికి సదరు నర్సు ఏడాది సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దీనికి రైల్వే బోర్డు నుంచి అనుమతి రాలేదు. కావాలంటే లాస్ ఆఫ్ పేగా పరిగణిస్తామంటూ సెలవిచ్చింది. ఇదిలా ఉండగానే ఆమెకు కవలలు జన్మించారు. ఇద్దరి బిడ్డల ఆలనాపాలనా చూసుకునేందుకు ఈ అమ్మకు సెలవు కావాలని ఇప్పుడు ముంబై హైకోర్టులో పిటిషిన్ వేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని కోర్టు కేంద్రప్రభుత్వం, రైల్వేకు నోటీసులు కూడా జారీచేసింది. ఇంత శ్రమపడకుండా పుట్టేవరకు ఆ అద్దె గర్భం దాల్చిన తల్లి బాధ్యత తమదే అంటోంది డాక్టర్ నయనా పటేల్. గుజరాత్‌లోని ఆనంద్ అనే గ్రామంలో ఉన్న ఈ హాస్పిటల్ ఎందరికో మాతృత్వపు ప్రేమను పంచుతున్నది.

 

వాసంతి.. కడు పేదరికంతో మగ్గిపోతోంది. ఒక కూతురు. పుట్టిన నాటి నుంచే ఆ బిడ్డ పాలకు, చదువుకు అన్నీ అడ్డంకులే. అప్పుడే సరోగసీ గురించి తెలుసుకుని డాక్టర్ నయనా పటేల్‌ని కలిసింది. ఒక బ్రిటీషర్‌కి పండంటి మగబిడ్డను కనిచ్చింది. ఫలితం.. తన కూతురిని ఇంగ్లీష్ కాన్వెంట్‌లో వేయడమే కాకుండా.. సొంతింటిని నిర్మించుకుంది. పాపియాది మరో స్టోరీ. తన మరదలు పెళ్లి చేయడానికి మొదటిసారి సరోగసీ ద్వారా గర్భం దాల్చింది. ఇప్పుడు తమ కుటుంబాన్ని ఆదుకోవడానికి రెండోసారి గర్భవతి అయింది. అయితే ఈసారి కవలలని తేలింది. అంటే.. ముందుకంటే ఎక్కువ మొత్తంలో ఆమెకు డబ్బులు వస్తాయని, తమ కష్టాలు తీరిపోయినట్లేనని సంబరపడుతోంది. ఇలాంటి ఎన్నో కథలు అక్కడ ప్రతినిత్యం వినిపిస్తూనే ఉంటాయి.

 

నయన దగ్గరకు చేరిన తల్లులకు వైద్య సదుపాయంతో పాటు.. తొమ్మిదినెలల సమయంలో సంప్రదాయ బద్దంగా శ్రీమంతం కూడా చేయిస్తుంది. పోషకాహరంతో కూడిన భోజనం, వసతులతో చిన్న ఇంటిలో ఉన్న ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌ని పెద్ద భవనంలోకి మార్చే ప్రయత్నంలో ఉంది నయన. ఈ క్లినిక్‌లో ఒక అంతస్తులో అమ్మ కావాలనుకునే తల్లులు, మరొక ఫ్లోర్‌లో అద్దె గర్భం ధరించిన తల్లులు ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకేసారి వందమంది తల్లులకు ఆశ్రయం కల్పించవచ్చు. మరో ఫ్లోర్‌లో డెలివరీ రూమ్. ఐవీఎఫ్ డిపార్ట్‌మెంట్, రెస్టారెంట్, గిఫ్ట్ షాప్‌లు కూడా ఉండే విధంగా దాని నిర్మాణం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: