ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను ఏపీకి పరిపాలనా రాజధానిగా చేయాలని అక్కడి నుండే పాలన కొనసాగించాలని సిద్ధమవుతున్న తరుణంలో రెండు విమాన సంస్థలు ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చాయి. ప్రముఖ విమాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఏషియా విశాఖకు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇండిగో సంస్థ మార్చి నెల రెండవ వారం నుండి హైదరాబాద్ - వైజాగ్ - హైదరాబాద్, చెన్నై - వైజాగ్ - చెన్నై సర్వీసులను రద్దు చేయనుంది. 
 
ఎయిర్ ఏషియా సంస్థ కూడా కోల్ కతా - వైజాగ్ మధ్య నడుపుతున్న విమాన సర్వీసును రద్దు చేయనుంది. ఇండిగో, ఎయిర్ ఏషియా సంస్థలు నిర్వహణా భారం అధికంగా ఉండటం వలనే విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు విశాఖ కేంద్రంగా నడిచే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు మిగతా విమాన సంస్థలు తమ సర్వీసులను కొన్ని రోజుల పాటు నిలిపివేస్తున్నాయి. ప్రముఖ విమాన సంస్థ స్పైస్ జెట్ వారం రోజుల పాటు విశాఖ - ఢిల్లీ - విశాఖ సర్వీసులను నిలిపివేసింది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు కొన్ని దేశీయ విమానయాన సంస్థలు విశాఖ - హైదరాబాద్, విశాఖ - బెంగళూరు సర్వీసులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఏఏఐ నుండి ప్రతిపాదనలు పంపిన సంస్థలకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. 
 
ఏపీ సీఎం జగన్ విశాఖ నుండి పాలన సాగించాలని సిద్ధమతుతున్న సమయంలో ప్రముఖ విమానయాన సంస్థలు విశాఖకు గుడ్ బై చెప్పడం జగన్ కు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. ప్రభుత్వం కార్య నిర్వాహక వ్యవస్థంతా విశాఖలోనే ఏర్పాటు చేయనుంది. రాబోయే రోజుల్లో రాజ్ భవన్, సచివాలయం, హెచ్,వో.డీ ఆఫీసులు కూడా విశాఖలోనే ఏర్పాటు కానున్నాయి. రానున్న రోజుల్లో విశాఖకు పర్యాటకుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జగన్ పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తరుణంలో రెండు సంస్థలు గుడ్ బై చెప్పటంతో విశాఖ విమానయాన రంగానికి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: