నాడు-నేడు... ఈ కాన్సెప్ట్‌ సీఎం మానస పుత్రిక. ముందుగా విద్యా శాఖలో మొదలైన ఈ కార్యక్రమం మిగిలిన శాఖలకు విస్తరిస్తోంది. విద్యా, వైద్యారోగ్య శాఖలతో పాటు తాజాగా పారిశుద్ధ్యం, సుందరీకరణ విషయంలోనూ నాడు-నేడు విధానాన్ని అవలంభించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

 

అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లో సీఎం జగన్‌.. తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రధానాంశమే అయినా, అభివృద్ధి విషయానికొచ్చేసరికి విద్య, వైద్యారోగ్యానికి పెద్ద పీట వేస్తామన్నారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సులోనే విద్యా శాఖలో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు గతంలో ఎలా ఉన్నాయి. ఐదేళ్లలో ఎలా మారుతాయో అన్నదే నాడు నేడు కాన్సెప్ట్. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం నిర్వహాణ, మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు తీసుకొచ్చి... గతానికి ప్రస్తుతానికి తేడాను కళ్లకు కట్టేలా ఫొటోలు.. వీడియోస్‌ సిద్ధం చేయాలన్నది ప్లాన్. సీఎం ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది ప్రభుత్వం.

 

విద్యాశాఖ మాదిరిగానే వైద్య ఆరోగ్య శాఖలోనూ నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇటీవలే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పథకం కింద ఆసుపత్రుల్లో మార్పులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. 989 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణతో పాటు 149 కొత్తవాటి నిర్మాణం కోసం 670 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 4 వేల పైచిలుకు ఉపకేంద్రాలను  కూడా ఏర్పాటు చేయాలని సర్కార్‌ డిసైడ్ అయింది. ఇక ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న 47 ఏరియా ఆస్పత్రులు, 89 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధికి నడుం బిగించింది సర్కార్‌. దీని కోసం నాబార్డులోని ఆర్ఐడీఎఫ్ నిధులను వెచ్చించనుంది.

 

విద్య, వైద్యారోగ్య శాఖల్లో మాదిరిగానే తాజాగా కృష్ణా-గోదావరి కాల్వలను కాలుష్య రహితంగా మార్చాలని నిర్ణయించారు. దీనిపై గత కొంత కాలంగా సీఎం జగన్‌ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కాలువ గట్లను ప్రజలకు ఉపయోగపడే వాకింగ్‌ ట్రాక్‌లుగా, పార్క్‌లుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనుంది సర్కార్. దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైటును ప్రారంభించారు సీఎం. కృష్ణా-గోదావరి డెల్టాల పరిధిలో సుమారు 20 వేల కిలోమీటర్ల మేర కాల్వలు ఉంటాయని అంచనా. వీటిల్లో ముందుగా 1344 కిలోమీటర్ల పరిధిలోని 36 మేజర్‌ కాల్వల్లో అభివృద్ధి.. సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. 

 

ముందుగా విజయవాడ, విశాఖలో పనులు చేపట్టనున్నారు. తొలి విడతగా 18 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో కార్యక్రమం మొదలు పెట్టనుంది ప్రభుత్వం. దీంట్లో భాగంగా కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించనున్నారు. ఇళ్లు కట్టిన తర్వాత వారిని అక్కడి నుంచి తరలిస్తారు. ప్రజలకు తెలిసేలా ఫోటోలు తీసి ఇప్పుడున్న పరిస్ధితి, భవిష్యత్‌లో ఏలా తీర్చిదిద్దేది చూపనున్నారు అధికారులు. మొత్తంగా నాడు-నేడు కాన్సెప్ట్‌ ఒక్కో శాఖకు..విస్తరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: