తెలంగాణాలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల పై టీఆర్ఎస్   నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ స్థానాల ఎంపికలో కేసీఆర్ కరుణ ఎవరిమీద ఉంటుందా అనే ఉత్కంఠ పార్టీ నాయకుల్లో నెలకొంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలిగా కేసీఆర్ కుమార్తె కవిత పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆమెను ఎమ్యెల్సీ ద్వారా మంత్రిని చేయాలని చూస్తున్నారని మరో ప్రచారం రావడంతో ఎవరికి వారు అధినేత ఆశీస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు త్యాగం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాజ్యసభ స్థానం ఇస్తారని ప్రచారం ఒకవైపు జరుగుతుండగా... కేసీఆర్ మాత్రం వేరే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


కవులు, కళాకారులకు రాజ్యసభ స్థానాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే గతంలో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సీటుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒక దశలో ఆయనకు రాజ్యసభ సీటు ఫిక్స్ అయిపోయింది అని కూడా ప్రచారం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నామా నాగేశ్వరరావు కు ఖమ్మం ఎంపీ సీటు కేసీఆర్ ఇవ్వడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సీటును త్యాగం చేశారు. ఈసారి మాత్రం కేసీఆర్ తనకు న్యాయం చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో పొంగులేటికి ఏపీ సీఎం జగన్ కూడా సాయం చేస్తారని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు.


 వైసీపీ నుంచి టిఆర్ఎస్ లో చేరినప్పటికీ జగన్ తో పొంగులేటి సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. దీని కారణంగానే తన సీటు విషయంలో కేసీఆర్ కు సిఫార్సు చేయాల్సిందిగా ఇప్పటికే జగన్ ను కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్ ఈ విషయమై కేసీఆర్ తో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నట్టు పొంగులేటి అనుచరులు చెబుతున్నారు. అయితే కేసీఆర్ రాజ్యసభ సభ్యుల ఎంపిక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా ఉంది. ఈ రెండు సీట్ల కోసం ఇప్పటికే పార్టీలో చాలా పోటీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన వినోద్ కుమార్ కూడా ఎంపీ పదవి పై ఆశలు పెట్టుకున్నారు.


 అలాగే చాలామంది రాజ్యసభ స్థానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బూర నర్సయ్య గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇలా ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న వారి లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే పొంగులేటి మాత్రం రెండు స్థానాల్లో ఒకటి తనకు తప్పకుండా దక్కుతుందని జగన్ ఈ విషయంలో కేసీఆర్ తో మాట్లాడుతారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: