కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. గతంలో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం కరోనా వ్యాప్తి తగ్గలేదు. చైనా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. చైనా దేశంలో పరిశ్రమలు ఇప్పటివరకూ తెరచుకోలేదు. దేశంలోని ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
పరిశ్రమలు తెరచుకోకపోవడం, ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో చైనాలో అన్ని రంగాల వస్తువుల అమ్మకాలు ఘోరంగా పడిపోవటంతో పాటు అనేక రంగాల ఆర్థిక వృద్ధి రేటు తిరోగమనంలో పయనిస్తోంది. కరోనా ఇతర రంగాలతో పోలిస్తే ఆటో మొబైల్ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 92 శాతం కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో డీలర్లు షోరూమ్ లకు తాళాలు వేస్తున్నారు. 
 
కరోనా ప్రభావం పరోక్షంగా భారత్ పై పడుతోంది. చైనా నుండి దిగుమతి అయ్యే ఓపెన్ సేల్ టెలివిజన్ ప్యానెళ్ల దిగుమతి తగ్గిపోయింది. మార్చి నెల నుండి టీవీల ధరలు 10 శాతం పెరగనున్నాయని తెలుస్తోంది. టీవీల తయారీలో టెలివిజన్ ప్యానెల్స్ అతి ముఖ్యమైనవి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రమే తెరచుకోగా విధులకు చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది హాజరవుతున్నారు. 
 
చైనాలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల వలన టెలివిజన్ ప్యానెళ్ల ఉత్పత్తిలో 30 నుండి 40 శాతం వరకు ఉత్పత్తిలో కోత ఉంటుందని తెలుస్తోంది. మార్చి నెల నుండి సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. చైనాలో మంగళవారం రోజున 1700 కొత్త కేసులు నమోదు కాగా బుధవారం 349 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటంతో మరికొన్ని రోజుల్లో చైనా కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: