హైదరాబాద్ యూనివర్సీటీ...టీఎన్జీవోల మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. ఓ భూ వ్యవహారంలో రెండు వర్గాలు రోడ్డెక్కాయి. ఆ భూమి మాదంటే మాది అంటూ హెచ్ సీయూతో పాటు ఎన్జీవోలు ఘర్షణ పడుతున్నాయి. యూనివర్సిటీ భూములను కాపాడాలని విద్యార్ధులు రంగంలోకి దిగడంతో భూ పంచాయితీ ముదురుతోంది.

 

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్శిటీ కోసం మూడు వేల ఎకరాలు  కేటాయించింది అప్పటి ప్రభుత్వం. ఇందులో కొంతభాగం ట్రిపుల్ ఐటీ కోసం, కొంత స్డేడియం కోసం, మరికొంత యూనివర్శిటీ బస్ డిపోకు కేటాయించారు. ఐఎస్ బికి కూడా కొంత స్థలం ఇచ్చారు. ఈ కేటాయింపులు అన్నీ పోను హెచ్ సీయూ పరిధిలో 2100 ఎకరాలు ఉంది.  ఈ భూముల్లో టీఎన్జీఓ, సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. తన పరిధిలో ఉన్న భూముల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించిన హెచ్ సీయూ... ఉద్యోగులకు కేటాయించిన స్ధలంకి ఒకవైపు మాత్రం ప్రహరీ కట్టలేదు. గతంలో అక్కడ రోడ్డు ఉందన్న కారణంతో దాన్ని అలాగే వదిలేశారు. అయితే ఆ భూమిని కబ్జా అయ్యే ప్రమాదముందన్న కారణంతో ఇప్పుడు గోడ కట్టేందుకు హెచ్ సీయూ  ప్రయత్నించింది. ఇదే వివాదానికి కారణమైంది. యూనివర్సిటీకి ఉన్న 2100 ఎకరాల భూమి... కేటాయింపుల ప్రకారం హెచ్ సీయూదే. కానీ ఇప్పటికీ రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూమిగానే ఉంది. 

 

టీఎన్జీవోలకు కేటాయించిన భూమిలో ఫేజ్ 1 నిర్మాణంలోఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఫేజ్ 2 లో ఇంకా ఈ ప్రక్రియ మొదలవ్వలేదు. ప్రస్తుతం టీఎన్జీవో కాలనీ కి యూనివర్సీటీ నిర్మించుకున్న ప్రహారీ వెంట... గోపి చంద్ అకాడమీకి ఎదరుగా వచ్చేందుకు వీలుగా గతంలో రోడ్డు నిర్మాణం కూడా చేసి ఉంది. టీఎన్జీవో కాలనీ నుంచి నేరుగా ఐఎస్బీ వరకు రావటానికి 1.5 కిలో మీటర్లు ఉంటుంది. కానీ యూనివర్సిటీ గోపించంద్ అకాడమీకి ఎదురుగా ఉన్న రహదారి ని మూసేసింది. దీంతోఇప్పుడు టీఎన్జీవో కాలనీకి వెళ్లాలంటే విప్రో జంక్షన్ నుంచి వెళ్లాలి. ఇలా చుట్టూ తిరిగి వెళ్లే 5 కి.మీ దూరం వస్తుంది. కొత్తగా టీఎన్జీవోలకు కేటాయించిన ఫేజ్ 2 నుంచి యూనివర్సీటకి వచ్చే వైపున్న దారిని మూసేస్తూ... ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై రెవిన్యూ అధికారులకు టీఎన్జీవోలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల సాయంతో...రెవిన్యూ ఉద్యోగులు యూనివర్సిటీ కట్టిన గోడను కూల్చేశారు. దీంతో యూనివర్సిటీ విద్యార్ధులు అంతా కూల్చిన గొడ దగ్గరకు వెళ్లి టీఎన్జీవోలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.


రెగ్యులర్ గా ఉండే దారిని యూనివర్సిటీ అధికారులు కావాలని మూసేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీఎన్జీవోలు. 20 ఫీట్ల రోడ్డును 150 ఫీట్ల రోడ్డుగా మార్చేందుకు టీఎన్జీవోలు ఒత్తిడి తెస్తున్నారని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు. యూనివర్శిటీ, టీఎన్జీవోల మధ్య గట్టు పంచాయితీ ఎటు దారితీస్తుందో అంతుపట్టడం లేదు. ఎవరికి వాళ్లు  వివాదాస్పద భూమి తమకే చెందాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: