వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సీటు కోసం పోటీ తీవ్రమైంది. వైసీపీ నేతల్లో కొందరు రాజ్యసభ ఎంపీల స్థానాల కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయడానికి తీర్మానం చేయడంతో రాజ్యసభ సీటు కోసం నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే ఒక జాబితా తయారైందని జాబితాలోని వారికి మాత్రమే చోటు దక్కుతుందని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మండలి రద్దైతే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పదవులు కోల్పోనున్నారు. మొదట పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీట్లు గ్యారంటీ అంటూ ప్రచారం జరిగినా ప్రస్తుతం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మాత్రమే చోటు దక్కినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి కూడా రాజ్యసభ సీటు పక్కా అని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరంజీవి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు. సైరా సినిమా విడుదలైన తరువాత చిరంజీవి దంపతులు జగన్ ను ప్రత్యేకంగా కలిసి సినిమా వీక్షించాలని కోరారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మెచ్చుకుంటూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే పరోక్షంగా జనసేనను దెబ్బ తీసినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
జగన్ తన సోదరి షర్మిలను కూడా రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జగన్ జైలులో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ బాధ్యతలను తీసుకొని షర్మిల ఓదార్పు యాత్రను కొనసాగించారు. వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలబడ్డారు. జగన్ షర్మిలను రాజ్యసభకు పంపి గౌరవించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కు కూడా రాజ్యసభ సీటు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఈ నలుగురికే ఛాన్స్ ఇస్తుందా...? లేదా..? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: