అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు రోజుల్లో భారత్ కు రానున్న విషయం తెలిసిందే. ట్రంప్ తో పాటు ఆయన కూతురు ఇవాంకా, అల్లుడు జరీద్ కుశ్నర్ కూడా ఇండియాలో అడుగుపెట్టనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ట్రంప్ పర్యటన కొరకు అమెరికా భద్రతా విమానం ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకుంది. నిజానికి ట్రంప్ కు అమెరికానే భద్రతాధికారుల్ని ఏర్పాటు చేస్తుంది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ట్రంప్ భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
ట్రంప్ కుటుంబం కోసం ఢిల్లీలోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ ఇప్పటికే సిద్ధమైంది. గత 14 రోజుల నుండి ఈ హోటల్ దగ్గర తనిఖీలు, నిఘాలు కొనసాగుతుండగా ఇప్పటికే ఈ హోటల్ పూర్తిగా భద్రతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. గతంలో ఇదే హోటల్ లో జార్జి బుష్, బరాక్ ఒబామా స్టే చేశారు. ట్రంప్ స్టే చేసే హోటల్ లో రాయబార కార్యాలయ అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రతి ఫ్లోర్ ను సర్వే చేస్తున్నారు. 
 
కేంద్రం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ పోలీసుల సెక్యూరిటీ వింగ్ , జిల్లా పోలీసులు కలిసి మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. మరోవైపు ట్రంప్ భద్రత కోసం 24x7 సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటుంది.ఈ ఏజెన్సీ ట్రంప్ విదేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే మూడు నెలల ముందు నుండే ఏర్పాట్లు చేస్తుంది. 
 
సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ భద్రతాపరమైన అంశాల గురించి స్థానిక పోలీసుల నుండి, ప్రభుత్వం నుండి సమాచారం తీసుకుంటుంది. ట్రంప్ పర్యటన కోసం ఇండియాకు ఒక హెలికాఫ్టర్, ప్రత్యేకమైన కారు, వివిధ రకాల వస్తువులు, సామాగ్రితో కూడిన ఏడు విమానాలు చేరుకుంటాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ట్రంప్ వాహన శ్రేణి వెళ్లే మార్గాన్ని కూడా లైవ్ రికార్డింగ్ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: