ఢిల్లీలోని అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. ఉగ్రవాదం, సైబర్ క్రైం ప్రపంచానికి పెద్ద సవాళ్లుగా మారాయని చెప్పారు. నిరంతర అధ్యయనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుప్రీం కోర్టు కీలక తీర్పులు ఇచ్చిందని ఈ తీర్పులను దేశ ప్రజలు గౌరవించారని తెలిపారు. 
 
వ్యవస్థలో మార్పులు చట్టబద్ధంగా, హేతుబద్ధంగా జరగాలని మోదీ అన్నారు. చట్టమే అత్యున్నతమైనది అని చట్టమనేది రాజులకే రారాజు అని మోదీ అన్నారు. మహాత్మగాంధీ న్యాయవాది అని గాంధీ ఆచరించిన మార్గంలోనే న్యాయవ్యవస్థకు పునాది వేశామని చెప్పారు. సత్యం, సేవా మార్గంలో గాంధీజీ తన జీవితాన్ని కొనసాగించారని చెప్పారు. గాంధీజీ తన ఆత్మకథలో తన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాశారని మోదీ చెప్పారు. 
 
దేశంలోని సంక్లిష్ట సమస్యల పరిష్కారం కోసం న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని మోదీ అన్నారు. భారతదేశ శాసన, న్యాయ శాఖలు పరస్పరం గౌరవించుకుంటాయని చెప్పారు. మహిళలకు 70 సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో సముచిత ప్రాధాన్యం కల్పించామని వ్యాఖ్యలు చేశారు. 135 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించుకుంటున్నారని చెప్పారు. 
 
మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్ కూడా ఒకటని మోదీ చెప్పారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరి జీవితాలకు మార్గదర్శకం అని చెప్పారు.  దేశంలో సుప్రీం తన తీర్పులతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో సహకరించిందని మోదీ చెప్పారు. మారుతున్న సాంకేతిక వ్యవస్థను అందరూ అందిపుచ్చుకోవాలని మోదీ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో మోదీ ఈరోజు అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు 24 దేశాల న్యాయ నిపుణులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ జస్టిస్ బోబ్డే హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: