గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలుగుదేశంపార్టీని సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఇపుడు కమ్ముకుంటున్న సమస్యలకు ఒక విధంగా స్వయంకృతమే కారణమని చెప్పాలి. తాజాగా మాజీ మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు కేంద్రంగా పెరిగిపోతున్న ఇఎస్ఐ భారీ స్కాం ఓ ఉదాహరణగా చెప్పుకోవాలి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంలో అచ్చెన్నదే కీలక పాత్రగా ఆధారాలు బయటపడుతున్నాయి. సరే ఆయన ఎలాగూ రాజకీయ కక్షగా ఎదురుదాడి చేస్తున్నాడనుకోండి అది వేరే సంగతి.

 

నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకడైన అహ్మద్ పటేల్ కు చంద్రబాబునాయుడు నుండి రూ. 400 కోట్లు హవాలా పద్దతిలో డబ్బు అందిందనే ఆరోపణలు అందరూ చూసిందే. అంతకుముందు ఆయన దగ్గర పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ అండ్ కో పై ఐటి దాడులు జరిగాయి. తమ సోదాల్లో రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయనటానికి ఆధారాలు దొరికినట్లు స్వయంగా ఐటి శాఖే రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోట్ ఎంత సంచలనంగా మారిందో అందరూ చూసిందే.

 

సరే ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెలుగుదేశంపార్టీకి కొత్తేమీకాదు. కానీ ఒక్కసారిగా ఇన్ని సమస్యలు ఎందుకు కమ్ముకుంటున్నాయి ? ఎందుకంటే ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆకాశమే హద్దుగా అవినీతి చెలరేగిపోయింది. క్రిందస్ధాయి నుండి పై స్ధాయి వరకూ ఎవరికి దొరికింది వారు అడ్డదిడ్డంగా అవినీతితో  రెచ్చిపోయారు. గతంలో చంద్రబాబు పాలించిన ఎనిమిదిన్నర ఏళ్ళ పాలనలో అవినీతి ఇంత స్ధాయిలో జరగలేదు.

 

మరి ఇప్పుడే ఎందుకు ఇలా చెలరేగిపోయారంటే వచ్చే 20 ఏళ్ళూ  తామే అధికారంలో ఉంటామనే భ్రమలో ఉండటమే కారణమని చెప్పాలి. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదని తమకు ఎదురే లేదని చంద్రబాబు అందరినీ నమ్మించాడు. చంద్రబాబు తనను తాను మోసం చేసుకోవటమే కాకుండా తన చేతిలోని మీడియా ద్వారా తనను నమ్ముకున్న వాళ్ళను కూడా  భ్రమల్లో ముంచేశాడు.  కళ్ళు మూసుకుపోయిన మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు అందినకాడికి రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఎవరూ ఊహించని రీతిలో ఐదేళ్ళకే టిడిపి చాప చిరిగిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నది. దాంతో అప్పట్లో రెచ్చిపోయిన వాళ్ళను ఇపుడు సమస్యలు కమ్ముకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: