ఏపీలో గ‌తేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు సిద్ధమైన చంద్రబాబు అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్ర‌జాచైత‌న్య యాత్ర ప్రారంభించారు. వైసీపీ త‌ప్పుల‌ను ఎత్తి చూపేందుకు అప్పుడే స‌మ‌ర‌శంఖం పూరించారు. మ‌రోవైపు ఎన్నిక‌లు ముగిశాక చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు లేకుండా పోయారు. కొంద‌రు పార్టీ మారిపోవ‌డ‌మో లేదా మ‌రికొంద‌రు పార్టీకి దూర‌మ‌వ్వ‌డ‌మో జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే తాజాగా నాలుగు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.

 

గుడివాడ‌, బాప‌ట్ల, మాచ‌ర్ల‌, ఏలూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు పార్టీ ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించిన చంద్ర‌బాబు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గమైన గన్నవరం ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. అలాగే దివంగ‌త మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మొన్న‌టి వ‌ర‌కు ప్రాథినిత్యం వ‌హించిన స‌త్తెన‌ప‌ల్లిలో సైతం చంద్ర‌బాబు ఎవ్వ‌రిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌లేదు. కోడెల శివప్రసాద్ రావు మరణంతో సత్తెనపల్లి ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది.

 

ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్‌గా చంద్రబాబు కోడెల కుమారుడు శివరామ్‌కు అవకాశం ఇస్తారేమో అని చాలామంది ఎదురుచూశారు. అయితే తండ్రి అధికారంలో ఉన్న ఐదేళ్లు శివ‌రాం తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని చేసిన దందాల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నారు. ఈ క్ర‌మంలోనే స‌త్తెన‌ప‌ల్లిలో చాలా మంది కోడెల కుటుంబాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. అయితే అదే టైంలో అక్క‌డ మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు సైతం క‌న్నేశారు.

 

రంగారావు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఈ సీటు ఆశించారు. ఇక ఇటు పార్టీలోనూ రంగారావుకే ఎక్కువ మొగ్గు క‌న‌ప‌డుతోంది. రాయ‌పాటి కుటుంబానికే స‌త్తెన‌ప‌ల్లి సీటు ఇవ్వాల‌న్న డిమాండ్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కోడెల ఫ్యామిలీని బాబు వ్యూహాత్మ‌కంగా సైడ్ చేసేందుకే స‌త్తెన‌ప‌ల్లి సీటును ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. మ‌రి కోడెల ఫ్యామిలీ ఫ్యూచ‌ర్ టీడీపీలో ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: