టీడీపీ గత ఐదేళ్ల పాలనపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఆదేశించడాన్ని ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణాలు, టెండర్లు సహా అన్నింటిపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పెషల్ టీమ్‌కు కొన్ని ప్రత్యేక అధికారులను కల్పించింది. అయితే ఇదంతా రాజకీయ కక్షసాధింపులో భాగమని అంటున్న ప్రతిపక్షం టీడీపీ.. తాము కూడా రెడీ అంటోంది.

 

లోకేష్ తన ట్వీట్‌లో మహామేత’, ‘యువనేత’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మహామేత అన్న లోకేశ్.. చంద్రబాబుపై ఆ నాటి వైఎస్ ప్రభుత్వం 26కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, ఒక సీబీసీఐడీ విచారణ చేయించిందని.. కానీ ఏమైందని ఎద్దేవా చేశారు.

 

ఈ సిట్ ఏర్పాటుపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. వైఎస్ హయాంలోనే ఎన్నో విచారణలు జరిపారని ఏం సాధించలేకపోయారన్నారు. గత తొమ్మిది నెలలుగా సబ్ కమిటీలు, విజిలెన్స్, సీఐడీ విచారణల పేరుతో హడావడి చేశారని.. చివరికి ఏం సాధించారని ఎద్దేవా చేశారు. ఈ సిట్ కూడా అంతేనన్నారు.

 

జగన్ సర్కార్ వచ్చాక.. గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారని.. ఏమైందని ట్వీట్ చేశారు. ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని.. అది కూడా హత్య కేసులను విచారణ చెయ్యాల్సిన పోలీసులతో సిట్ వేశారని విమర్శించారు. ‘యువమేత’ ఆత్రం.. ఇక్కడే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చెయ్యడమే పనిగా పెట్టుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: