అన్ని ఉగ్రవాద సంస్థల హిట్‌ లిస్ట్‌లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నకు...విదేశీ పర్యటనల్లో భద్రత ఎలా ఉంటుంది?  ఉగ్రవాదులు, నేరస్థులు, శత్రుదేశాల గూఢాచారుల నుంచి ముప్పు పొంచి ఉన్న ఆయన... లక్షలాది మంది ప్రజల మధ్య రోడ్‌ షో నిర్వహించనున్నారు. మరి ఆయన పర్యటనకు సంబంధించిన భద్రతా బాధ్యతలు ఎవరు చూస్తారు? అసలు అమెరికా అధ్యక్షుడి భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది?

 

 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వ్యవస్థ సీక్రెట్ సర్వీస్....అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకుంటుంది. సుశిక్షుతులైన భద్రతా సిబ్బంది, వాయు వేగంతో స్పందించే కమాండోలు ఈ భద్రతా వ్యవస్థ ప్రత్యేకత.

 

అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏర్పాటుకు 1865 ఏప్రిల్‌ 14న అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే అదే రోజున  లింకన్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జులై 5న సీక్రెట్‌ సర్వీస్‌ ఏర్పాటైంది. మొదట్లో ఈ విభాగం అమెరికా అధ్యక్షుడ రక్షణ బాధ్యతలను చూసేది కాదు. సివిల్ తర్వాత ఆర్ధిక వ్యవస్థలోకి భారీగా చేరిన దొంగనోట్లను కట్టడి చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే 1901లో నాటి అధ్యక్షుడు విలియం మెకిన్సే హత్యతో అధ్యక్షుడి రక్షణ బాధ్యతలను కూడా సీక్రెట్‌ సర్వీసుకు ప్రభుత్వం అప్పగించింది..

 

అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌లో సిబ్బందికి కఠోర శిక్షణ ఉంటుంది. వారికి 29 వారాల శిక్షణ అందిస్తారు. తుపాకీ కాల్పులు, ఆత్మాహుతి బాంబర్లను, పేలుళ్లను ఎదుర్కోవడం, అధునాతన ఆయుధాలతో ఎదురుదాడి, అనుమానాస్పద పదార్థాలను పసిగట్టడంవంటి అంశాల్లో వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా చురుగ్గా వ్యవహరించడం, సమయస్పూర్తిని ప్రదర్శించేలా ట్రైనింగ్ కొనసాగుతుంది.

 

అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటన చేపట్టినప్పుడు సీక్రెట్‌ సర్వీసు అధికారులు 3 నెలల ముందే అక్కడికి చేరుకొని ఏర్పాట్లు మొదలుపెడతారు. స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ప్రణాళికను తయారు చేసుకుంటారు. అధ్యక్షుడు పర్యటించే ప్రాంతాల్లో గగనతలంలో, రోడ్డు మార్గంలో ఎలాంటి ముప్పు తలెత్తకుండా చూసుకుంటారు.

 

అధ్యక్షుడు రావడానికి ముందు 7 విమానాల్లో వివిధ పరికరాలు, హెలికాప్టర్‌, ప్రత్యేక వాహనాలు, కమ్యూనికేషన్‌ సాధనాలు సదరు దేశానికి చేరుకుంటాయి. వంట చేసేవారు కూడా అక్కడినుంచే వస్తారు. అధ్యక్షుడు బసచేసే హోటల్‌ను సీక్రెట్‌ సర్వీసు అధికారులే ఎంపిక చేస్తారు.  అధ్యక్షుడు బస చేసే హోటల్‌ గదిలో ప్రత్యేక రక్షణ, నిఘా పరికరాలు అమరుస్తారు. అమెరికా సీక్రెట్ సర్వీస్‌ ఏజెన్సీలో మొత్తం 6వేల 500 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో 3వేల 2వందల మంది స్పెషల్ ఏజెంట్లు, 13వందల మంది యూనిఫామ్ డివిజన్ అధికారులు, 2వేల మంది సాంకేతిక సహాయ సిబ్బంది ఉంటారు.

 

ఏజెన్సీలోని అతి కొద్ది మంది మాత్రమే అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పిస్తారు. వారికి మరింత ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ డివిజన్‌ గా వీరిని వ్వవహరిస్తారు. అత్యవసర సమయాల్లో అధ్యక్షుడిని ఆసుపత్రికి తరలించేవరకూ కాపాడుకొనేలా 10 మినిట్‌ మెడిసిన్‌లో వీరికి ట్రైనింగ్ ఇస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: