ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని రెండింతలు పెంచారు. వివాహానికి ముందే యువతి ఖాతాలో 20 శాతం వైయస్సార్ పెళ్లి కానుక నగదు జమయ్యేలా నిబంధనలలో మార్పులు చేశారు. సీఎం జగన్ ప్రోత్సాహకాన్ని రెండింతలు పెంచటంతో పాటు పెళ్లికి ముందే యువతి ఖాతాలో కొంత మొత్తం జమ అయ్యేలా నిర్ణయం తీసుకోవటంపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. 
 
గతంలో పెళ్లికానుక ప్రోత్సాహకం ఎస్సీలకు 40 వేల రూపాయలు, ఎస్టీలకు 50 వేల రూపాయలు టీడీపీ ప్రభుత్వం అందజేసింది. వైసీపీ ప్రభుత్వం పెంచిన ప్రోత్సాహకం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు ఇవ్వనుంది. ప్రభుత్వం బీసీలకు 35 వేల రూపాయల నుండి 50 వేల రూపాయలకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి 50 వేల రూపాయల నుండి 75 వేల రూపాయలకు పెంచింది. మైనార్టీలకు 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలకు, దివ్యాంగులకు లక్ష రూపాయల నుండి లక్షన్నర రూపాయలకు ప్రోత్సాహకం పెంచింది. 
 
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలు వైయస్సార్ పెళ్లి కానుక పథకానికి అర్హులు. ప్రజా సాధికారిక సర్వేలో నమోదై వివాహం చేసుకోబోయే యువతి, యువకుడు రేషన్ కార్డుల్లో పేర్లు ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు. ఈ పథకానికి మొదటిసారి వివాహం చేసుకునేవారు అర్హులు. ఈ పథకానికి అర్హత పొందాలంటే వివాహానికి 15 రోజుల ముందు మండల వెలుగు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 
 
దరఖాస్తు వివరాలను కళ్యాణమిత్రలు వచ్చి పరిశీలించి అర్హత ఉన్నవారికి ప్రభుత్వం అందించే 20 శాతం ఆర్థిక సాయాన్ని యువతి ఖాతాలో జమ చేస్తారు. వైయస్సార్ పెళ్లికానుక పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది. వెలుగు కార్యాలయంలో దరఖాస్తు చేసిన తరువాత దరఖాస్తు ఆమోదం పొందితే వివాహానికి ముందు 20 శాతం, వివాహం తరువాత 80 శాతం యువతి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. వైయస్సార్ పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే లబ్ధిదారుల వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పెళ్లి పత్రిక, తెల్ల రేషన్ కార్డు, పెళ్లి కూతురు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, వివాహ రిజిస్ట్రేషన్ ధువీకరణ పత్రం ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: