ఇంట్లో ఒక్క పురుషుడికైన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌ కి ఒప్పించండి.. లేదంటే మీ ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ డైరెక్టర్ ఛవీ భరద్వాజ్ ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. మగవాళ్లకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పై టార్గెట్ పెడుతూ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చి వివాదంలో చిక్కుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆర్డర్స్‌ పై ఎమర్జెన్సీ-2 అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆదేశాలను వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ సర్కార్.

 

 

అయితే.. గురువారం ఈ సర్క్యులర్ వచ్చిన కొద్ది గంటలకే సోషల్ మీడియాలో ఆర్డర్ కాపీ వైరల్ అయింది. మగవాళ్లకు బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించేందుకు ఉద్యోగులపై ఒత్తిడి తేవడమేనంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు చేయించినట్లుగా బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఎమర్జెన్సీ-2 నడుస్తోందని, మేల్ మల్టీ పర్సస్ హెల్త్ ఎంప్లాయిస్ సరిగా పని చేయకుంటే మరో రకంగా చర్యలు తీసుకోవాలే కానీ, జీతాలు ఆపుతామనడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ్ సహా పలువురు నేతలు కూడా సీఎం కమల్‌ నాథ్‌ పై విమర్శలు చేశారు.

 

 

కాగా., ఈ విషయంపై భారీగా విమర్శలు రావడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. కొద్ది గంటల్లోనే ఆ సర్క్యులర్‌ ను వెనక్కి తీసుకుంటూ ఆరోగ్య శాఖ మంత్రి తుల్సీ శిలావత్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వివాదాస్పద ఆర్డర్స్ ఇచ్చిన అధికారి ఛవీ భరద్వాజ్‌ పై బదిలీ వేటు వేశారు. ఆయన్ని సచివాలయంలో ఓఎస్డీగా నియమించారు.

 

 

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం 2019- 20లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మగవాళ్లు కేవలం 0.5 శాతం ఉన్నారు. ఈ సంఖ్య మరీ ఘోరంగా ఉందని, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాల్లో నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో కనీసం 5 నుంచి పది మంది మగవాళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించాలని ఆ సర్క్యులర్‌లో టార్గెట్ పెట్టారు. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: