అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమైన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే బాబు, విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జగన్ పాలన సరిగా లేదని, అన్ని రద్దు చేసుకుంటూ వెళుతున్నారని, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని బాబు ఆందోళనలు చేస్తున్నారు. అయితే బాబు ఎన్ని ఆందోళనలు చేసినా, అవి ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదు. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వకుండా ఇలా ఆందోళనలు చేయడం సరికాదనే భావనలో ప్రజలు ఉన్నారని తెలిసింది.

 

ఈ క్రమంలోనే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, దాన్ని బాబు వ్యతిరేకించి అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ, ఉద్యమం మొదలు పెట్టారు. అయితే ఈ ఉద్యమానికి కూడా  బాబుకు పెద్ద మద్ధతు రాలేదు. ఏదో కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తప్ప, మిగతా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆశించిన స్పందన రాలేదు. సరైన స్పందన లేకపోయిన, బాబు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని ఉదృతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

 

సరిగా ఇలాంటి సమయంలోనే జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బాబుకు బాగా కలిసొచ్చింది. కొత్త పింఛన్, రేషన్ కార్డులు జారీ చేసే నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అనర్హుల పేరుతో చాలామందికి పెన్షన్, రేషన్ కార్డులు తీసేస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా లోకల్ బాడీ ఎన్నికల ముందు జగన్ సర్కార్ ఇలా చేయడం బాబుకు అడ్వాంటేజ్‌గా మారింది. అదే సమస్యని పట్టుకుని ప్రజా చైతన్య యాత్ర పేరుతో జనంలోకి పోతున్నారు. ఇక ఆ యాత్రకు వస్తున్న స్పందన బట్టి చూస్తుంటే, జగన్ ప్రభుత్వంపై  ఏ స్థాయిలో వ్యతిరేకిత ఉందో అర్ధమవుతుంది.

 

వాస్తవానికి చెప్పాలంటే అనర్హులకే కాకుండా, అర్హులుకు కూడా రేషన్, పింఛన్లు పోతున్నాయి. అటు వాలంటీర్ల పనితీరు కూడా సరిగా లేదు.  వారికి ఇచ్చిన ట్యాబులలో ఎన్నో సాంకేతిక సమస్యలు, దాంతో ఎవరికీ అక్కడ ఏమీ తెలియదు, అంతా గందరగోళంగా పరిస్థితి ఉంది. దీంతో రేషన్ కార్డులు, పించన్లు పోగొట్టుకున్న వారి బాధ తారస్థాయిలో ఉంది. ఇది నిజంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకిత తీసుకొచ్చింది. అది కూడా లోకల్ బాడీ ఎన్నికల ముందు జరగడం టీడీపీకి బాగా కలిసిరానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: