మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేను పార్టీలోకి లాగేయడానికి సిద్ధమైందని తెలుస్తోంది. వైసీపీ ఆ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకుంటుందా...? లేక ఆ ఎమ్మెల్యే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వైసీపీకి మద్ధతిస్తారా...? అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
2014 సంవత్సరంలో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో విజయం సాధించగా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ చేతిలో ఓటమిపాలైంది. టీడీపీ తరపున పాలకొల్లు నుండి గెలిచిన నిమ్మల రామానాయుడు వైసీపీ పార్టీలో చేరాలని భావిస్తున్నాడని సమాచారం. వైసీపీ కూడా నిమ్మల రామానాయుడుని పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. 
 
2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు 2019 ఎన్నికల్లో కూడా జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించారు. నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడుకు భారీగా పట్టు ఉండటంతో వైసీపీ కూడా అతడిని చేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే నిమ్మల రామానాయుడుకు మంత్రి పదవి దక్కేది. 
 
టీడీపీ అధికారంలో లేకపోవడంతో పదవిలో ఉన్నప్పటికీ ప్రజలు తనను పట్టించుకోవడం లేదని, ఏ సమస్య వచ్చినా వైసీపీ కన్వీనర్ దగ్గరకే వెళుతున్నారని బాధపడిన నిమ్మల తన సన్నిహితుల దగ్గర వైసీపీలో చేరాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పినట్టు సమాచారం. కొందరు పాలకొల్లు నియోజకవర్గ నాయకులు ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలకు చెప్పారని నిమ్మలను పార్టీలో చేర్చుకోవడానికి వారు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తొంది. టీడీపీ, వైసీపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. టీడీపీ కీలక ఎమ్మెల్యే వైసీపీలో చేరితే మాత్రం చంద్రబాబుకు వైసీపీ మరో షాక్ ఇచ్చినట్టే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: